ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశం గుండెల మీద సందడిచేస్తూ...

23 నిమిషాల క్రితం

istockphoto-487730152-612x612.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 09:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నిన్న మొన్నటిదాకా దిగాలుగా

గడ్డకట్టిన నైరాశ్యపు కళ్ళల్లో

పేరుకుపోయిన నిశీధి బిళ్ళల్లా

గుండెలవిసి ఏడుస్తున్న నల్ల బల్లల్లా

సొమ్మసిల్లి పడిపోయిన రోడ్లన్నీ

ఇవాళ ప్రవహిస్తున్న నదుల్లా

పోటెత్తుతున్న సముద్రాల్లా

చేతుల కండరాలు బిగించిమరీ

చైతన్య కాంతులతో చిందులేస్తున్నాయి!


పువ్వుల్లా పరిమళించాల్సిన రోడ్లు

రివ్వున ఎగురుతున్న గువ్వల్లా

పరలళ్ళు తొక్కాల్సిన రోడ్లు

విజ్ఞానపు వినువీధుల్లో

అక్షరాల నక్షత్ర తోరణాల్లా

విభాత కాంతులు విరజిమ్మాల్సిన రోడ్లు

ఏళ్ల తరబడి అలక్ష్యానికి గురై

మురికి కూపల్లా పశుల కొట్టాల్లా

పాల బుగ్గలమీద మొలిచిన

స్పోటకపు మచ్చల్లా

వికృతంగా మారిపోతున్నా

ఇప్పటికీ ఈషణ్మాత్రమూ స్పందించని

ఏబ్రాసి పాలకులమీద

ఇవాళ నిప్పులు చెరుగుతున్నాయి!

గద్దెలు దిగిపొమ్మని గొంతులు పెగిల్చిమరీ

గగ్గోలు పెడుతున్నాయి!


ఎంత కాలానికెంత కాలానికి

మన్నుతిన్న పాముల్లా

పడివున్న రోడ్లు ఇంతలా

కళాకాంతులు సంతరించుకున్నాయి!

ఎంత కాలానికెంత కాలానికి

లేగదూడల్లా మూగ మొహాలేసుకొని

తడబడుతూ సాగిపోయే రోడ్లు

నిగనిగలాడుతున్న మేడిపండు రాజ్యం

పొట్ట పగలగొట్టి

లుకలుకలాడుతున్న పురుగుల్ని

పసికట్టి చూపెట్టగలిగాయి!


పగళ్లను పహారా కాస్తున్న

ఏ సూర్యుడూ ఈ పగుళ్లను గుర్తెరగలేదే!

రాత్రులకు రక్షణకవచంగా కాపుకాస్తున్న

ఏ చంద్రుడూ ఈ దిగుళ్లను గమనించలేదే!

ఎక్కణ్నిం వచ్చింది ఈ రోడ్లకు

ఇంత సమరశీల శక్తి!

ఏ దిక్కుల్లోంచి పుక్కిటపట్టాయి

ఏలికల గుండెల్లో వంద వందేభారత్

రైళ్లను ఒకేసారి పరిగెత్తించగల

ఇంత విమర్శనాత్మక సామర్థ్యాన్ని!

అంతా స్వయంకృతమే!

స్వీయ నిర్వాకమే!


ఇక ఎంత కాలంమో చెల్లదు

అసత్యాల అల్లికలతో

కుళ్ళిపోయిన ఈ శవయాత్ర!

రోడ్లు చీదరించుకుంటున్నాయి!

గాలి విసురుకు జారి పడిన

విద్యుత్ తీగల్లా విరుచుకుపడుతున్నాయి!

గుత్తుల గుత్తుల గెలాక్సీలన్నీ

దేశం గుండెలమీద సందడిచేస్తూ

కాలం గొంగళిపురుగుని

కలల సీతాకోక చిలుకగా మార్చే

ఉక్కుసంకల్పపు రెక్కల్ని

వొక్కపెట్టున విదిల్చుకుంటున్నాయి!!

పతివాడ నాస్తిక్

9441724167



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్