శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్గో ఎయిర్ పోర్టుపై నోటిఫికేషన్?

1 గంట క్రితం

Mandasa Cargo Airport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 11:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి

- ప్రజావ్యతిరేకతతో యంత్రాంగం సతమతం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : మందస కార్గో ఎయిర్ పోర్టు విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఎయిర్ పోర్టుపై నోటిఫికేషన్ ఇచ్చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, ఆ దిశగా అధికారులు కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. 2018లో నాటి టిడిపి ప్రభుత్వం భావనపాడుపై ఇదే తరహాలో రైతులకు తెలియకుండానే భూ సేకరణ నోటిఫికేషన్ వెలువరించి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు కార్గో ఎయిర్ పోర్టు విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వంలో అదే ఆత్రం కనిపిస్తోంది. ఎయిర్ పోర్టు ప్రతిపాదనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొనడంతో ఇప్పటివరకు ఒక్క అడుగూ పడలేదు. క్ష్రేత్ర స్థాయిలో రెవెన్యూ సిబ్బందిని సైతం రైతులు తిరగనీయడం లేదు. గ్రామాల్లో సభలు నిర్వహణకూ అంగీకరించడం లేదు. ఎయిర్ పోర్టు ప్రభావిత గ్రామాల్లో సమావేశాలు నిర్వహించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎదుటే ప్రజలు తమకు ఎయిర్ పోర్టు అవసరం లేదని తేల్చి చెప్పేస్తున్నారు. పరిహారం, ప్యాకేజీల పేరుతో స్థానికులను ప్రలోభాలకు గురి చేసే ప్రభుత్వ ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో, జిల్లా యంత్రాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మరోవైపు భూ సేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు కాకపోవడం, ప్రజలను ఒప్పించలేకపోవడంపై ప్రభుత్వం నుంచీ తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ వద్ద ఉన్న రికార్డులు, భూములకు సంబంధించిన మ్యాప్ ల ఆధారంగా భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అవార్డు పాస్ చేసి భూములకు పరిహారం అందించొచ్చని జిల్లా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

1261.54 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తింపు

మందసలో ప్రభుత్వం తలపెట్టిన కార్గో ఎయిర్ పోర్టుకు 1261.54 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇవి 1,348 మంది రైతులకు చెందినవి. మందస మండలం బిడిమి, బేతాళపురం, లక్ష్మీపురం, వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు, చీపురుపల్లి తదితర రెవెన్యూ గ్రామాల్లో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ భూముల వివరాలు సిద్ధంగా ఉన్నా, జిరాయితీ భూముల వివరాలు సరిగా పోలడం లేదు. దీంతో, భూముల వివరాలపై సర్వే కోసం అధికారులు పలుమార్లు యత్నించారు. గ్రామల్లో సభలు నిర్వహించి రైతులను ఒప్పించేందుకు శత విధాల ప్రయత్నించారు. తహశీల్దార్ నుంచి ఆర్‌డిఒ వరకు ప్రయత్నించినా గ్రామస్తులు ససేమిరా అన్నారు.

ప్రత్యేక గ్రీవెన్స్ పేరుతో అభిప్రాయ సేకరణ

ఎయిర్ పోర్టుపై గ్రామాల్లో కనీసం సమావేశాల నిర్వహించేందుకు సైతం ప్రజలు ఒప్పుకోకపోవడంతో అధికారులు కొత్త మార్గం ఎంచుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రభావిత గ్రామాలన్నింటిలోనూ భూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ పేరుతో సమావేశాలు నిర్వహించారు.

భూ సమస్యల పరిష్కారంపై దృష్టి

భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అవార్డు పాస్ చేసి పరిహారం చెల్లించేలా ప్లాన్ చేస్తున్న అధికారులు తొలుత భూ సమస్యల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. భూముల సర్వే నంబర్లు సరి చేయడం, జాయింట్ ఎల్‌పిఎం నంబర్ల చిక్కులు, జిరాయితీ భూమి ప్రభుత్వ భూమిగా నమోదు కావడం వంటి వాటిని ఆగమేఘాలపై రెవెన్యూ అధికారులు సరి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

90 శాతంపైగా అయిష్టతతో ఉన్నట్లు *ఇంటెలిజెన్స్‌ సర్వేలో వెల్లడి!

కార్గో ఎయిర్ పోర్టు పని నెరవేర్చుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్ లో 200 మంది విఆర్ఒలతో అధికారులు ఇంటింటా సర్వే చేయించారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగం, ఉపాధి తదితర వివరాలు, ఎయిర్ పోర్టుకు అంగీకారమా? కాదా? అన్న అంశాలతో సర్వే చేపట్టారు. సర్వేలో అత్యధిక మంది ప్రజలు ఎయిర్ పోర్టు వద్దని చెప్పినట్టు తెలిసింది. తాజాగా ఇంటెలిజెన్స్‌ పోలీసులతో అన్ని గ్రామాల్లోనూ సర్వే చేపట్టినట్టు సమాచారం. ఇందులో 90 శాతం పైగా అయిష్టత కనబరిచినట్టు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్