ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
ప్రజాశక్తి - యంత్రాంగం : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ)ను, నూతన విద్యా విధానం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సాగించిన పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విద్యారంగ వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో పోరాటాలు సాగిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని నాయకులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్‌టిఎ నిర్వహించిన నీట్ పరీక్ష లీకేజీ కారణంగా 20 మందికిపైగా ఆత్మహత్య చేసుకోవటం, ఆ తర్వాత సిజెపి ఉద్యమం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా వంటి పరిణామాలు జరిగినా ఎన్‌టిఎ పరీక్షల వైఫల్యం మరోసారి బయటపడిందన్నారు. తాజాగా నిర్వహించిన యుజిసి నెట్ పరీక్షల్లోనూ తప్పులు దొర్లాయని, దీంతో మళ్లీ నిర్వహించటానికి షెడ్యూలు విడుదల చేశారన్నారు. వరుస వైఫల్యాలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఎన్‌టిఎను ఇప్పటికైనా రద్దు చేసి, పరీక్షల వికేంద్రకరణ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ ద్వారా రాష్ర్టాలు మెడికల్ సీట్లను భర్తీ చేసిన విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్లు షేక్.సమీర్, వై.కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నగరంలో ప్రకాశం చౌక్ లో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కోణాల జోసెఫ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రసాద్ మాట్లాడుతూ...న్‌టిఎను రద్దు చేయాలని, పటిష్ట విద్యా వ్యవస్థ తీసుకురావాలని, లేనిపక్షంలో విద్యార్థులంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కడప కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. రైతు సంఘం, సిఐటియు, ఐద్వా, కెవిపిఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.








కామెంట్‌లు (0)