- ఆశా వర్కర్స్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆశా వర్కర్స్ సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ తెలిపింది. వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(సిఇఓ) ప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య,ఆరోగ్య శాఖ కార్యాలయంలో చర్చలు జరిగాయి. ఆశా వర్కర్లకు వేతనాల పెంపు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను ఆశా వర్కర్లుగా మార్పు, చట్టబద్ధమైన సెలవులు, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలు, ఎఎన్ఎం, జిఎన్ఎం పోస్టుల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత తదితర సమస్యలపై గతంలో యూనియన్ గతంలో నిర్వహించిన పోరాటాల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించామని సిఎవోకు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. తమ శాఖ పరిధిలోని సమస్యలపై త్వరలోనే సర్క్యులర్స్ జారీ చేస్తాయని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ రూ.10లక్షల పెంపు అంశంపై యూనియన్ ప్రతినిధులు, బ్యాంకర్లతో ఈ నెల 30వ తేది చర్చించి తుది నిర్ణయం చేస్తామని చెప్పినట్లు చెప్పారు. దహన సంస్కారాల ఖర్చుల ఫైల్ ఆర్ధిక శాఖలో ఉందని, జీతాలు ఇతర డమాండ్లకు సంబంధించి ప్రభుత్వానికి తెలిపామని పేర్కొన్నారు. చర్చల పేరుతో సమస్యల పరిష్కారాన్ని కాలయాపన చేయొద్దని యూనియన్ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మీ తెలిపారు. త్వరగా తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు పూనుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు జి రమణకుమారి, ఉపాధ్యక్షులు సిహెచ్ పద్మ, కోశాధికారి ఏ కమల, కార్యదర్శులు వెంకటేశ్వరమ్మ, రత్నకుమారి, కె లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)