- ఇద్దరు మృతి
మాస్కో : రష్యా రాజధాని మాస్కోతోపాటు ఇరత ప్రాంతాలపై ఏకంగా 1,000కి పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. రష్యాలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం తుదిదశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రష్యా భద్రతాబలగాలు స్థానిక శాంతిభద్రతలపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ డ్రోన్ దాడులకు పాల్పడటం గమనార్హం. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ దాడులు కొనసాగాయి. రష్యా రాజధానిపై జరిగిన అతిపెద్ద దాడి అని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ అన్నారు. ఆయిల్ రిఫైనరీతోపాటు, ప్రజల నివాసాలపై కూడా దాడులు జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో 74 ఏళ్ల ఒక వృద్ధుడు, 44 ఏళ్ల మహిళ ఉన్నారు. ఈ దాడిపై రష్యా రక్షణ శాఖ కూడా స్పందించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 1,100 డ్రోన్‌లను తాము కూల్చివేశామని పేర్కొంది. క్రిమియాతోపాటు నల్ల సముద్రంపై కూడా దాడి జరిగిందని తెలిపింది.







కామెంట్‌లు (0)