ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కృత్రిమ మేధ కట్టడికి చైనా ముందస్తు చర్యలు

48 నిమిషాల క్రితం

ai china
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:04 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- సాంకేతిక భద్రత, ప్రభుత్వ పర్యవేక్షణకు ప్రాధాన్యం

- స్వతంత్ర ఎఐ ఏజెంట్లపై *భద్రతా ప్రమాణాల రూపకల్పన

బీజింగ్‌ : మానవ నియంత్రణను దాటి కృత్రిమ మేధ (ఏఐ) స్వతంత్రంగా వ్యవహరించే ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. చైనా ముందస్తు భద్రతా చర్యలపై దృష్టి సారిస్తోంది. ఏఐ తనకు తానే నకళ్లను సృష్టించుకోవడం, వనరులను సమీకరించడం, మానవ నియంత్రణకు సవాలు విసరడం వంటి భవిష్యత్తు ప్రమాదాలను చైనా ఇప్పటికే తన ఏఐ భద్రతా విధానాల్లో గుర్తించింది. సాంకేతిక ప్రమాణాలు, ప్రభుత్వ పర్యవేక్షణ, భద్రతా పరీక్షల ద్వారా ఈ ముప్పులను నియంత్రించేందుకు బీజింగ్ చర్యలు చేపడుతోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధిలో అమెరికా, చైనా ప్రపంచంలోని రెండు ప్రధాన శక్తులుగా ఉన్నాయి. ఏఐ విధానాలు, పరిశ్రమల ఆచరణల విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల చివర్లో జరగనున్న ద్వైపాక్షిక చర్చల్లో ఏఐ భద్రత అంశం కీలకంగా మారనుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ పరిశోధకులు శక్తిమంతమైన ఏఐ మోడళ్లు మానవ నియంత్రణ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు చైనాలోనూ ఏఐ భద్రతపై జరుగుతున్న చర్చలకు ప్రాధాన్యం పెంచాయి.

​మానవాళికి అంతిమ ముప్పు కాదు

అత్యాధునిక ఏఐ మానవాళి ఉనికికే ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్నపై అమెరికాలో చర్చ ఎక్కువగా సాగుతోంది. దీనికి భిన్నంగా చైనా విధానకర్తలు ఏఐని శక్తిమంతమైనప్పటికీ నియంత్రించగల సాంకేతిక పరిజ్ఞానంగా పరిగణిస్తున్నారు. బీజింగ్, సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఏఐ భద్రత, పాలన పరిశోధనా సంస్థ కాంకోర్డియా ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్రియాన్ త్సే ప్రకారం.. చైనా, అమెరికా నిపుణులు ఏఐ ప్రమాదాల విషయంలో ఎక్కువగా ఏకీభవిస్తున్నారు. అయితే ఆ ప్రమాదాలను ఎలా నిర్వచించాలి, ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయంలో తేడాలున్నాయి. చైనా విధానం ప్రధానంగా ఏఐ అభివృద్ధి సంస్థల బాధ్యతలు, ప్రభుత్వ మద్దతుతో రూపొందించే సాంకేతిక ప్రమాణాలు, భద్రతా అంచనాలు, స్వతంత్ర పరీక్షలు, ప్రభుత్వ పర్యవేక్షణపై ఆధారపడి ఉంది.

​ఓపెన్-వెయిట్ మోడళ్లపై చైనా దృష్టి

చైనా ఏఐ సంస్థలు ఓపెన్-వెయిట్ మోడళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ మోడళ్లలోని అంతర్గత పారామీటర్లను డౌన్‌లోడ్ చేసుకుని పరిశీలించడం, మార్చడం సాధ్యమవుతుంది. అమెరికాకు చెందిన ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి ప్రముఖ సంస్థలు తమ మోడళ్ల అంతర్గత స్పెసిఫికేషన్లను బహిరంగంగా అందుబాటులో ఉంచడం లేదు.

​స్వతంత్రంగా వ్యవహరించే ఏఐ ఏజెంట్లపై నిఘా

చైనా సైబర్‌స్పేస్ నియంత్రణ సంస్థ, ఆర్థిక ప్రణాళిక సంస్థ, పరిశ్రమ మంత్రిత్వ శాఖలు మేలో విడుదల చేసిన విధానంలో ఏఐ ఏజెంట్ల నియంత్రణ కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించాయి. సాధారణ చాట్‌బాట్లతో పోలిస్తే ఏఐ ఏజెంట్లు అనేక దశలతో కూడిన పనులను స్వతంత్రంగా ప్రణాళిక రూపొందించి నిర్వహించగల వ్యవస్థలు. ఉదాహరణకు.. ఒక లక్ష్యాన్ని అందించినప్పుడు సమాచారాన్ని సేకరించడం, నిర్ణయాలు తీసుకోవడం, ఇతర డిజిటల్ వ్యవస్థలను ఉపయోగించడం వంటి పనులను అవి నిర్వహించగలవు. చైనా ఏఐ ఏజెంట్ల భద్రతకు సంబంధించి తప్పనిసరి జాతీయ ప్రమాణాన్ని రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది. కాంకోర్డియా ఏఐకి చెందిన బ్రియాన్ త్సే అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రమాణం ప్రపంచంలోనే ఈ తరహాలో తొలి జాతీయ ప్రమాణం కావచ్చన్నారు.

​అమెరికా ఏఐ మోడళ్లపై చైనా ఆందోళనలు

చైనా ప్రభుత్వ భద్రతా మంత్రి చెన్ యిక్సిన్ రాసిన ఓ కథనంలో.. ఆంత్రోపిక్‌కు చెందిన మిథోస్, ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ-5.5 సైబర్‌ వంటి అత్యాధునిక అమెరికా ఏఐ మోడళ్లు చైనా కీలక సమాచార మౌలిక వసతులకు తీవ్రమైన ప్రమాదాలను కలిగించవచ్చని పేర్కొన్నారు. ఏఐ భద్రతను సమగ్రంగా బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే దీనిపై ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ స్పందించాల్సి ఉంది. ఏఐ మోడళ్లను పరిశీలించేందుకు, మార్చేందుకు వీలుండటం సైబర్‌ భద్రతా పరిశోధనలకు ఉపయోగపడుతుందని చైనా డెవలపర్స్‌ చెప్తున్నారు.

2025లో మరింత విస్తరించిన భద్రతా వ్యవస్థ

చైనా సైబర్‌స్పేస్ పరిపాలనా సంస్థ 2025 సెప్టెంబర్‌లో ఈ భద్రతా వ్యవస్థను విస్తరించింది. కొత్త పత్రంలో ఏఐ మేధస్సు అకస్మాత్తుగా, ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం గురించి ప్రస్తావించారు. అనంతరం ఏఐ వ్యవస్థలు వనరులను సంపాదించుకోవడం, తమను తాము తయారు చేసుకోవడం, శక్తిని పొందేందుకు ప్రయత్నించడం వంటి పరిణామాలు సంభవించే ప్రమాదాన్ని గుర్తించారు.

‘విశ్వసనీయ వినియోగం.. నియంత్రణ కోల్పోకుండా నివారణ’ అనే పాలనా సూత్రాన్ని కూడా చేర్చారు. చైనా నియంత్రణ సంస్థ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నిపుణుల వివరణ ప్రకారం.. మానవ మనుగడ, అభివృద్ధికి ముప్పుగా మారే ఏఐ నియంత్రణ కోల్పోయే ప్రమాదాలను నివారించడమే ఈ సూత్రం లక్ష్యం. ఏఐ నియంత్రణల నుంచి తప్పించుకునే అవకాశం ఉన్న పరిస్థితిని కూడా అందులో ప్రస్తావించారు.

​ఏఐ అభివృద్ధిని ఆపడం కాదు.. భద్రతతో ముందుకు సాగడం

అత్యాధునిక ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడం, మందగించేలా చేయాలని పాశ్చాత్య దేశాల్లోని కొందరు ఏఐ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్ల అభివృద్ధికి ముందుగా తగిన భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని వారు వాదిస్తున్నారు. అయితే చైనా విధానం ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడంపై కాకుండా.. భద్రతా నియంత్రణలతో సాంకేతిక వినియోగాన్ని విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్