ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యా, ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలం

50 నిమిషాల క్రితం

bjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- దీప్సితా ధర్‌ విమర్శ

మంగళూరు : కేంద్రంలో 2014 నుండి అధికారంలో ఉన్నప్పటికీ విద్యా, ఉపాధి కల్పనలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం పశ్చిమ బెంగాల్‌ నాయకులు, విద్యార్థి ఉద్యమ నేత దీప్సితా ధర్‌ విమర్శించారు. ఆదివారం మంగళూరులోని బిషప్ జాతన్న ఆడిటోరియంలో అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) దక్షిణ కన్నడ జిల్లా మహాసభ ప్రారంభోత్సవంలో ఆదివారం నాడు ఆమె ప్రసంగించారు. యువతకు ప్రతియేటా కోట్లాది ఉద్యోగాలు సృష్టిస్తామన్న గొప్పగొప్ప హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన బిజెపి ఆ తర్వాత పకోడీలు వేసుకోడంటూ ఉచిత సలహాలు ఇచ్చి యువతను మోసగించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం హక్కులను కాలారాస్తూ వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. బాలికలు, మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు, మధ్య తరగతి ప్రజలపై భారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య కోసం, అవినీతికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులను బిజెపి పాలకులు దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంస్కృతిక, కళా వేదికల ద్వారా సామాజిక విభజనలు సృష్టించేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, వందలాది మంది యువకులు జ్యోతి సర్కిల్ నుంచి మహాసభ వేదిక వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. డివైఎఫ్‌ఐ కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి బసవరాజ్‌ పూజార్‌, డివైఎఫ్‌ఐ దక్షిణ కన్నడ జిల్లా అధ్యక్షులు బికె ఇంతియాజ్‌, కార్యదర్శి సంతోష్‌ బజల్‌ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్