సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనసాగుతున్న ప్రతిపక్షాల ఆందోళన

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:33 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఉభయ సభల్లో*రెండు బిల్లులు ఆమోదం

- చర్చ లేకుండానే మూజువాణిగా..

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పేప‌ర్ లీకేజీ, అయోధ్య రామాల‌య విరాళాల చోరీ ఘ‌ట‌న‌లకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనతో సోమవారం పార్లమెంట్ స్తంభించింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై అణచివేత చర్యలకు సంబంధించి హోం మంత్రి సరైన వివరణ ఇచ్చే వరకూ పార్లమెంటులో నిరసన కొనసాగిస్తామని ప్రతిపక్షం పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో, సభా కార్యకలా పాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. పార్లమెంటు వెలుపల కూడా ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ‘అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు రావడం లేదు?’ అంటూ రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శిస్తూ ఎంపిలు ఆందోళన చేపట్టారు.

న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు ఆమోదం..

ఎంపీల నిరసనల మధ్య, సుప్రీంకోర్టులో సిజెఐ సహా న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ సహకార (సవరణ) చట్టానికి మద్దతుగా తన నివేదికను సమర్పించింది. స్వల్ప మార్పులతో ఈ బిల్లును చట్టంగా మార్చాలని జెపిసి సిఫార్సు చేసింది. లోక్‌సభలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ సవరణ బిల్లు, కేంద్ర స‌హాయ మంత్రి రావు ఇంద్ర‌జిత్ సింగ్‌.. ఇండియ‌న్ స్టాటిస్‌టిక‌ల్ ఇన్స్‌టిట్యూట్ బిల్లు ను ప్రవేశపెట్టారు. ఇది బ్యాంకు రికార్డులను కోర్టులో విశ్వసనీయ సాక్ష్యంగా స్వీకరించడానికి అనుమతి స్తుంది. 1891 నాటి చట్టం స్థానంలో వచ్చిన ఈ చట్టంలో, డిజిటల్, ఎలక్ట్రానిక్, వర్చువల్ రికార్డులను బ్యాంకు రికార్డులుగా చేర్చే నిబంధనలు ఉన్నాయి.

లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఉభయ సభలలో ప్రతిపక్షాల నిరసనలను నిలువరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జంతర్ మంతర్ వద్ద పోలీసుల చర్య, అయోధ్యలో అఘాయిత్యాలపై చర్చించకుండా నిరసనల నుండి వెనక్కి తగ్గబోమని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. నిరసనలు తీవ్రం కావడంతో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వ తీరుపై నిరసనల కోసం ప్రణాళికలు రూపొందించడానికి ఇండియా బ్లాక్ ఎంపిలు సమావేశమయ్యారు.

పార్లమెంట్ ఆవరణలో ఆందోళన

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థి నిరసనకారులపై పోలీసుల బల ప్రయోగంపై పార్లమెంట్‌ ప్రాంగణంలోని మకర ద్వారం ముందు నిరసన చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్, శివదాసన్, ఎస్పికి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టిఎంసి ఎంపి మహువామొయిత్రా, జెఎంఎం ఎంపి మహువా మాఝీ, ఆర్ఎస్‌పి ఎంపి ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. రామమందిరం లో విరాళాల చోరీకి ప్రతీకగా విరాళాల పెట్టెలను పార్లమెంట్‌ ఆవరణలో ఉంచారు. ప్రతిపక్ష ఎంపిలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాటి చుట్టూ బారులు తీరారు. కొందరు ఎంపిలు విరాళాల పెట్టెలో నగదు కూడా వేశారు. ఆ తర్వాత విరాళాల ఆదాయం లెక్కింపు సందర్భంగా చోరీ చేయడాన్ని ప్రతీతాత్మకంగా ప్రదర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్