గవర్నర్‌కు వైయస్సార్‌సీపీ విజ్ఞప్తి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను వైయస్సార్‌సీపీ ప్రతినిధులు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కలిశారు. అనంతరం అక్కడే మీడియాతో బొత్స మాట్లాడారు. మెగా డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారని అన్నారు.ప అడుగడుగునా ఆక్రమాలే జరిగాయని, వైసిపి ప్రశ్నించిన తరువాతే సెలక్షన్ లిస్ట్ ఇచ్చారని, జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు చేశారని అన్నారు. వాటిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర దర్యాప్తుతో ప్రయోజనం ఉండదని చెప్పినట్లు పేర్కొన్నారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డితో దర్యాప్తు చేయించాలని కోరామని, దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ ఇకనైనా పిల్ల చేష్టలు ఆపాలని, తప్పు జరగకపోతే సీబీఐ దర్యాప్తుకు భయమెందుకని ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ప్రభుత్వ హత్యేనని అన్నారు. దీనిపైనా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందేనని డిమాండు చేశారు. అనుమానాస్పదంగా చనిపోతే సెక్షన్ 302 లేదా 307 పెడతారని,దానిపై చర్యలు తీసుకుంటారని, కానీ ఇక్కడ ఎలాంటి చర్యల్లేవని తెలిపారు. ప్రభుత్వం పోలీసులతో కుమ్మక్కై ఈ హత్యకు పాల్పడిందని, హంతకుల్ని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. తాము అధికారంలో ఉండగా నంద్యాలలో ఓ ఆటోడ్రైవర్ ఏదో చేశాడని భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులైన అధికారుల్ని సస్పెన్షన్ తో పాటు అరెస్టు కూడా చేశామని తెలిపారు. ఈ హత్యకు కారకులందరూ బయటికి రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. ముందు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు. అప్పుడే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుందని బొత్స స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మురుగుడు హనుమంతరావు, వరుదు కల్యాణి, ఎంవీ రామచంద్రారెడ్డి, మొహమ్మద్ రుహుల్లా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)