జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టెట్, డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం పోస్టులను వీరితో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. శాసనసభ జీరో అవర్‌లో మంగళవారం ఈ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ టెట్, డిఎడ్ పూర్తి చేసిన వారు ఏళ్ల తరబడి నిరుద్యోగులుగా ఉండకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పుత్తూరు నుంచి సత్యవేడు వెళ్లేందుకు తమిళనాడులోని ఊతుకోట మీదుగా వెళ్లాల్సి ఉందని, దీనివల్ల ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. తమిళనాడు ప్రాంతంలోకి వెళ్లకుండా కొత్తగా రహదారి ఏర్పాటుకు రూ.26 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారని, వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీ సిటీలో ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. నీటి పారుదల శాఖలో డైరెక్ట్‌గా నియమితులైన 3 వేల మంది ఎఇలకు ఏళ్ల తరబడి ఉద్యోగోన్నతులు లేవని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూరారెడ్డి తెలిపారు. కింది కేడర్‌ల నుంచి ఉద్యోగోన్నతులపై వచ్చిన సిబ్బంది వీరికంటే ముందుగా డిఇఇలుగా ఉద్యోగోన్నతులు పొందుతుడటంతో వీరు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
బొబ్బిలి నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేవని ఎమ్మెల్యే ఆర్‌విఎస్‌కెకె రంగారావు తెలిపారు. మినీ హెల్త్ సెంటర్లను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. మునేరు ఆనకట్ట మరమ్మతులకు తక్షణమే నిధులు కేటాయించాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కోరారు. మదనపల్లె జిల్లాలో తాగునీటి కొరత అధికంగా ఉందని, బోర్లుకు మరమ్మతులు చేపట్టాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషణ్ కుమార్ కోరారు. మండలానికి రూ.కోటి కేటాయించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు తెలుగు మాట్లాడుతున్నారే తప్ప, చదవలేని, రాయలేని పరిస్థితిలో ఉన్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో తెలుగులో 37 వేల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. తెలుగు పరీక్షా పత్రాల రూపకల్పనను సరళతరం చేసి ఎక్కువ మంది విద్యార్థులు తెలుగు భాషను ఎంచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నంలోని ఎయిర్ పోర్టులో పని చేసిన 1,470 మంది వివిధ విభాగాల సిబ్బందిని ఆ పోయిర్‌పోర్టు మూసి వేయడంతో ఉపాధి కోల్పోయారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వీరందరికీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం సమీపంలో రెండో ఫ్లై ఓవర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దీనిని నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు. ఎస్‌పిఎఫ్‌లో ఉత్తరాంధ్ర ప్రాంత సిబ్బంది అధికంగా ఉంటారని, వీరిని రాయలసీమకు బదిలీ చేస్తున్నారని, రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించి వారిని బదిలీ చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు.







కామెంట్‌లు (0)