డ్రోన్ సిటీ సందర్శనలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
పలు యూనివర్సిటీలతో ఒప్పందాలు
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : గతంలో రాళ్ల (స్టోన్స్) పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఓర్వకల్లును.. ఇకపై 'డ్రోన్ల' దిశగా దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని జాతీయ స్థాయి డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. డ్రోన్ సిటీలో ఏర్పాటు చేసిన ఎపి డ్రోన్ పరిశ్రమల సిఇఒలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... డ్రోన్ల తయారీ, పరిశోధన, టెస్టింగ్, శిక్షణ, సర్టిఫికేషన్, సేవలను అనుసంధానించి సమగ్ర డ్రోన్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బివిఎల్ఒఎస్, యుటిఎం శాండ్‌బాక్స్, టెస్టింగ్, సర్టిఫికేషన్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, లాజిస్టిక్స్, కార్గో, నిఘా, శాంతిభద్రతల్లో డ్రోన్ల వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్రోన్ విడిభాగాల స్వదేశీ తయారీతో పాటు ఐఐటిలు, పరిశ్రమల సహకారంతో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తామని, డ్రోన్ శక్తిని యువ శక్తిగా మార్చేందుకు యువత ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ... ఓర్వకల్లును ప్రముఖ డ్రోన్, ఏవియేషన్, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎపిఐఐసి ఇడి యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... డ్రోన్ సిటీని తొలివిడతలో 120 ఎకరాలు, రెండో విడతలో 480 ఎకరాలు కలిపి 600 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సమక్షంలో ట్రిపుల్ ఐటి డిఎమ్ కర్నూలు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, కర్నూలు జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలతో ఎపి డ్రోన్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందాలు, ఎంఒయులు కుదుర్చుకున్నారు. అనంతరం ఎగ్జిబిషన్ స్టాళ్లను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ పునీత్ కన్సల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జాయింట్ డైరెక్టర్ జనరల్ భరత్ భూషణ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిడిజి అజిత్ కోశాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తులసి రామన్, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు స్మిత్ షా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, డ్రోన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)