- రైతుల ఆహ్వానం మేరకే వెళ్లాం
- వైసిపి నాయకులు పేర్ని, అంబటి, అప్పిరెడ్డి, మొండితోక
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతిలో అక్రమాలు, అవినీతి, అప్పుల వ్యవహారం బయటపడతాయనే ఉద్దేశంతోనే తమపై మట్టి మాఫియా, గూండాలతో దాడి చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతుల ఆహ్వానం మేరకు రాజధాని ప్రాంతానికి బయలుదేరారని అన్నారు. అక్కడ జరిగే అవినీతి, మట్టి తవ్వకం, పనుల్లో నిర్లక్ష్యం వంటి అంశాలను పరిశీలించేందుకు వెళుతున్న సమయంలో కొంతమంది టిడిపి గూండాలు దాడికి దిగారని, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ కారును ధ్వంసం చేశారని, రాళ్లు రువ్వారని తెలిపారు. కోడిగుడ్డు తీసుకొచ్చి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకుడు పాలకొల్లు సత్యం.. గూండాలను, క్వారీల్లో పనిచేసే వారిని తెచ్చి మద్యం తాగించి దాడి చేయించాడని, తాడేపల్లి మండల టిడిపి అధ్యక్షుడు పూలింగులో భూమి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారని, డిఎస్‌పి వచ్చి మరింత రెచ్చగొట్టి దాడి చేయించారని అన్నారు. తమపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారని, అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైసిపి నాయకులను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌పై రాయి వేసిందెవరో అందరికీ తెలుసని, రైతుల విజ్ఞప్తితోనే వైఎస్ జగన్ పరిరక్షణ కమిటీ వేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు కోరితేనే తాము వెళ్లామన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన దుర్మార్గంగా ఉందని, ప్రజాస్వామ్యయుతంగా వెళ్తే బండరాళ్లతో దాడి చేశారని, కేసులు పెడుతున్నారని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. వైసిపి నాయకులను అడ్డుకుంది టిడిపి గూండాలేనని అన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాళ్లతో కార్లు ధ్వంసం చేశారని, దాడి చేసిన వారిలో రైతులెవరూ లేరని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ.. టెర్రర్ సృష్టిస్తే అమరావతి ప్రజా రాజధాని ఎలా అవుతుందని ఆగ్రహించారు. దాడిలో టిడిపి మట్టి, ఇసుక మాఫియాదే కీలకపాత్ర అని అన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యం అరాచకాలు, లాకప్ డెత్‌లు జరుగుతున్నాయని, ఈ ఘటనపై మేధావులు ఆలోచించాలని పేర్కొన్నారు. వైసిపి నాయకులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చిల్లర వ్యక్తులను పోగేసి దాడులు చేశారని, ఇలాంటి నీచ రాజకీయాలు, దాడులకు తాము భయపడబోమని అన్నారు. రైతులకు వైసిపి అండగా ఉంటుందని తెలిపారు.









కామెంట్‌లు (0)