- కెవిపిఎస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 1,400 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథతదంగా కొనసాగించాలిని కులవివక్షా వ్యతిరేకపోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని ఎపిఎస్‌డబ్యుఆర్‌ఇఐఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు ఆయన శుక్రవారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, టిజిటిలు, పిజిటిలు, పిఈటిలు, నాన్-టీచింగ్ సిబ్బందిని యథాతథంగా కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత 22 ఏళ్లుగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ వేలాది మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. గత ఏడిది డిఎస్సి నియామకాల నేపథ్యంలో వీరిని విధుల నుండి తొలగించే పరిస్థితి నెలకొనడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ప్రస్తుతం 788 మంది ఉద్యోగులను సర్వీసును పునరుద్ధరించి, మిగిలిన ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచడం అత్యంత బాధాకరమన్నారు. మిగిలిన వారిని రెన్యువల్ చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల విద్యకు, ఉద్యోగుల కుటుంబాల జీవన భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎ.అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కోట కళ్యాణ్, టీచర్ల నాయకులు పరమేశు, శశిధర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)