మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపల్లెలకు పాలకుల శాపం

4 గంటల క్రితం

cpmcallec-1790701676083-2477.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 12:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పల్లె పండుగ కాదు... కాంట్రాక్టర్ల పండుగ

  • రెండు పల్లె పండుగలతో సాధించిన అభివృద్ధి ఏమిటో!

  • ప్రభుత్వం సమాధానం చెప్పాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : పాలకుల విధానాలు పల్లెలకు శాపంగా మారాయని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే రెండు పల్లె పండుగలు నిర్వహించిన ప్రభుత్వం, ఆ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండగ–3.0 పేరుతో చేపడుతున్న కార్యక్రమంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అనంతపురం నగరంలోని గణేనాయక్‌ ‌భవనంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. పల్లెలు పచ్చగా ఉండాలంటే ముందుగా రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికి తగిన ఆదాయం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత రెండేళ్లలో రైతుల ఆదాయాలు తగ్గి, వ్యవసాయ సంక్షోభం తీవ్రతరమైందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉన్నారని, పల్లె పండుగ–3.0 కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు? ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కల్పనకు, రైతుల ఆదాయాల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పల్లె పండుగ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు నిజంగా గ్రామీణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగ పడతాయో వివరించాలన్నారు. ఈ కార్యక్రమం ప్రజలకు పండుగగా కాకుండా కాంట్రాక్టర్లకు పండుగగా మారుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో హడావుడి చేస్తోందని విమర్శించారు. ఈ పనుల ద్వారా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరడం తప్ప, గ్రామీణ ప్రజల మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదన్నారు. పల్లెల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, రైతులకు గిట్టుబాటు ధరలు, కూలీలకు ఉపాధి, యువతకు ఉద్యోగాలు, ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు అందించి వలసలను నివారించడమే నిజమైన గ్రామీణ అభివృద్ధి అని వివరించారు. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించాలని, గత రెండు పల్లె పండుగల ద్వారా సాధించిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సచివాలయ ఉద్యోగులతో ఆటలొద్దు

తమ సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో సచివాలయ ఉద్యోగులు శాంతియుతంగా చేస్తున్న నిరసనపై పోలీసులతో దాడి చేయడాన్ని సిపిఎం ఖండిస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో పెట్టుకుంటే కొరివితో తలగొక్కున్నట్టేనని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలా కాకుండా అణచివేత ద్వారా చేస్తామంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

‘అనంత’కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కలెక్టర్‌‌కు వినతి

అనంతపురం జిల్లాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. సాగు చేసిన భూమికి ఎకరానికి రూ.50 వేలు పంటనష్టం పరిహారం చెల్లించాలి, సాగుచేయలేని రైతులకు ఎకరానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం చేయాలని, కౌలు రైతులకు కూడా పరిహారం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. వీటి అమలు కోసం అనంతపురం జిల్లాకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. రుణభారంతో ఇప్పటి వరకు 53 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. ప్రభుత్వం కరువు మండలాలను తక్షణం ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని, విబి గ్రామ్‌‌జి పనులను 200 రోజులకు పెంచాలని డిమాండ్‌ ‌చేశారు. నష్టపోయిన ఉద్యాన పంటల రైతులనూ ఆదుకోవాలని కోరారు. సిపిఎం జిల్లా నాయకులతో కలసి అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌‌ను ‌ఈ మేరకు శ్రీనివాసరావు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్