ఎంఎ బేబీతో సహా నాయకులను ఈడ్చుకెళ్లిన ఖాకీలు
సిఇసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జ్ఞానేష్‌కుమార్ తొలగింపు, ఎస్‌ఐఆర్ రద్దుకు నేతల డిమాండ్
న్యూఢిల్లీ - ప్రజాశక్తి బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ఆందోళనపై పోలీసు లు, కేంద్ర బలగాలు బలప్రయోగానికి దిగాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు శాంతి యుతంగా మార్చ్ నిర్వహించిన వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి బస్సుల్లో తరలించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ సహా పలువురు నేతలను అరెస్టు చేశారు.
రోడ్డుపై బైఠాయించిన వామపక్ష నేతలు..
మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన మార్చ్‌ను ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమీపంలోనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ప్లకార్డులు చేబూని సిఇసికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కొనసాగించేందుకు అనుమతించని పోలీసులు, కేంద్ర బలగాలు నేతలను, కార్యకర్తలను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. వృద్ధుల వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని వామపక్ష నేతలు విమర్శించారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఆర్. అరుణ్‌కుమార్, సీనియర్ నేతలు బృందా కరత్, సుభాషిణి అలీ, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, అఖిల భారత కిసాన్ సభ ట్రెజరర్ పి. కృష్ణప్రసాద్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ దినేశ్ వార్షి , నిషా సింధు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు సుచేత దే, శ్వేతా రాజ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. నేతలను, కార్యకర్తలను నాలుగు బస్సుల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ బస్సులను అడ్డుకున్న ఎంపిలు డాక్టర్ వి. శివదాసన్, ఎ.ఎ. రహీంలను కూడా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. శివదాసన్‌ను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు.
ఎన్నికల కమిషన్‌ను అరవుశాలగా మార్చారు : ఎంఎ బేబీ
పోలీసుల చర్య అనంతరం ఎంఎ బేబీ మాట్లాడుతూ, జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషన్‌ను ప్రజాస్వామ్యానికి ‘‘అరవుశాల’’గా మార్చారని విమర్శించారు. దేశ ప్రజలను ఓటర్ల జాబితాలో చేర్చాల్సిన కమిషన్, అందుకు విరుద్ధంగా ఓటర్ల పేర్లను తొలగించే చర్యలకు పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. ఓటర్ల పేర్ల తొలగింపునకు బాధ్యత వహిస్తున్న జ్ఞానేష్ కుమార్‌ను సిఇసి పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని కాపాడాల్సిన కమిషన్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సిఇసిని తొలగించాలి : బృందా కరత్
సిపిఎం సీనియర్ నేత బృందా కరత్ మాట్లాడుతూ, సిఇసి రాజీనామా చేయాలని, లేకపోతే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్‌ను తక్షణమే నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్ పనితీరుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు.
దేశవ్యాప్తంగా నిరసనలు: సుభాషిణి అలీ
సిపిఎం సీనియర్ నేత సుభాషిణి అలీ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, దాన్ని పరిరక్షించేందుకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. ఎస్‌ఐఆర్ అంశంపై ఇతర ప్రతిపక్ష పార్టీలతో పాటు పౌరసమాజ సంస్థలతోనూ విస్తృతంగా సమన్వయం చేసేందుకు వామపక్షాలు కట్టుబడి ఉన్నాయన్నారు.
వామపక్ష జాతీయ నాయకుల అరెస్టులకు సిపిఎం ఖండన
ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎబేబి సహా అఖిల భారత నాయకులు బి.వి.రాఘవులు, బృందాకరత్, సుభాషిణి ఆలీ, ఆర్.అరుణ్‌కుమార్, సిపిఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి దినేష్ వర్షినే ఇతర వామపక్ష పార్టీల నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన వారిని బే షరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 13 కోట్ల మంది ఓటర్లను అక్రమంగా తొలగించిన నేరానికి దేశవ్యాప్తంగా ప్రజా నిరసన పెల్లుబుకుతోందని, ప్రధాన ప్రతిపక్షాలన్నీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయని ఈ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఎన్‌డిఏ భాగస్వామ్యం పక్షాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అనేక ప్రశ్నలు లేవనెత్తాయని, వీటికి సమాధానాలు చెప్పడంలేదని విమర్శించారు. సిపిఎం సీనియర్ నాయకులు, వామపక్ష నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణమని తెలిపారు. ఈ అరెస్టులను ఖండించాలని మేధావులు, ప్రజాతంత్రవాదులు, పౌర సమాజాన్ని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)