ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘‘ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొంటున్న 13.30 కోట్ల పేర్లను వెంటనే తిరిగి చేర్చాలి. ప్రధాని మోడీ ఆదేశాల మేరకే జ్ఞానేష్ కుమార్ ఓట్లను తొలగించారని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ కూడా రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం నాడిక్కడ ఎఐసిసి ప్రధాన కార్యాలయం (ఇందిరా భవన్)లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సిడబ్ల్యుసి సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సమగ్రతపై ఉన్న ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయని సిడబ్ల్యుసి పేర్కొంది. ఇటీవల ఇసిఐని ఒకే వ్యక్తి కేంద్రంగా నడుపుతున్నారని, ఇతర ఎన్నికల కమిషనర్లతో సరైన సంప్రదింపులు లేకుండా సిఈసి నిర్ణయాలు తీసుకుంటున్నారని వచ్చిన నివేదికలను సిడబ్ల్యుసి ప్రస్తావించింది.
ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మగా సిఇసి : ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలుబొమ్మగా మారి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల మోడీ పాలనలో దేశ ప్రజాస్వామ్య పునాదులను కుట్రపూరితంగా డొల్లగా మార్చేశారన్నారు. పదేళ్ల క్రితం ‘నోట్ల రద్దు’తో ఆర్థిక వ్యవస్థను, ఇప్పుడు ‘ఓట్ల రద్దు’తో ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారని విమర్శించారు. ఫారమ్-6 నియమాలను అక్రమంగా మార్చి 'జెన్ జీ' యువతను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారన్నారు. ఓటర్ల జాబితాలో చేసే మార్పుల డేటాను తక్షణమే బహిరంగంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)