మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనైపుణ్యాలే చోదకశక్తి

4 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 11:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పాలనలో కొత్త ఒరవడి

  • మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ తొలి సదస్సులో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న 20 ఏళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధన శృంఖల-2026 మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రక్రియలు, ఉద్యోగుల నైపుణ్యాలు నిరంతరం మెరుగుపడాలన్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం ఉద్యోగులకు కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా ఉండకూడదన్నారు. సవాళ్లను పరిష్కరించడంలో ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే సంస్థలుగా అవి మారాలని సూచించారు. కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందడం మాత్రమే కెపాసిటీ బిల్డింగ్ కాదని.. నేర్చుకున్న అంశాలను ఉద్యోగులు తమ విధుల్లో ఎంతవరకు అమలు చేస్తున్నారు, ప్రజలకు అందే సేవల నాణ్యత ఎంత మెరుగుపడుతోందన్న అంశమే ప్రామాణికత అని ఆయన చెప్పారు. కంప్యూటర్లు వచ్చినా అనవసరమైన పేపర్‌వర్క్ కొనసాగడం, దరఖాస్తులను డిజిటల్ చేసినా అనేక అనుమతులు అవసరం కావడం, ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా పౌరులను కార్యాలయాలకు రప్పించడం వంటి విధానాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. జన్ విశ్వాస్ వంటి సంస్కరణలు ఈ దిశలో కీలకమని చెప్పారు.

ఎఐతో పాలనలో గణనీయమైన మార్పులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనా వ్యవహారాలను గణనీయంగా మార్చగలదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉద్యోగుల సామర్థ్య లోపాలను గుర్తించడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా శిక్షణా కోర్సులను సూచించడం, పరిపాలనా నిర్ణయాలను మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, యంత్రాంగం ప్రభుత్వ పాలనలో కీలకమన్నారు. వరదలు, తుపాన్ల లాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఉద్యోగులే ముందు ఉంటారని గుర్తుచేశారు. పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాలు, విపత్తుల సమయంలో కుటుంబాలను సైతం పక్కనపెట్టి ప్రజాసేవలో నిమగ్నం అవుతున్న ఉద్యోగుల సేవలను ఎప్పటికీ విస్మరించలేమని వ్యాఖ్యా నించారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని, ఆ సామర్థ్యాలను దేశాభివృద్ధికి వినియోగించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీని ప్రవేశపెట్టి, రాష్ట్రంలోని 38 శాఖలకు కెపాసిటీ బిల్డింగ్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్ పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తా, ఎపి ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయుష్ కుమార్, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కాటమనేని భాస్కర్ హాజరయ్యారు.

కెపాసిటీ బిల్డింగ్ లో ఏపీకి మొదటి స్థానం

ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఎపిఎస్‌‌డిపిఎస్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విఆర్ అలపర్తి అందుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక, మూడో స్థానంలో నిలిచిన ఒడిశా రాష్ట్రాలకు కూడా సీఎం అవార్డులు అందజేశారు. మిషన్ కర్మయోగి కింద ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 7.89 లక్షల మంది ఉద్యోగులు ఐగాట్‌లో నమోదు అయ్యారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేసి రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్