క్యాంపస్‌లో ఉన్నా బయటివారమే, 34 శాతం విద్యార్థుల ఆవేదన
నిరంతరం ఒత్తిడి, వివక్ష, వేధింపులు
సుప్రీం టాస్క్‌ఫోర్స్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 15 శాతం మంది దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశను ఎదుర్కొంటున్నారు. మరో 9 శాతం మందికి తరచుగా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టిఎఫ్) దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సర్వే ఏం చెప్పిందంటే?
ఉన్నత విద్య చదువుతున్న 2.43 లక్షల మందికి పైగా విద్యార్థుల అభిప్రాయాలను టాస్క్‌ఫోర్స్ సేకరించింది. వీరిలో 67 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థులు. 34 శాతం మంది తాము క్యాంపస్‌లో ఉన్నా బయటివారమనే భావనతో ఉన్నామని చెప్పారు. 32 శాతం మంది తమ విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ సేవలు లేవని తెలిపారు. విద్యాపరమైన ఒత్తిళ్లు, ఉపాధి ఆందోళనలు, వివక్ష, ఫ్యాకల్టీ తోడ్పాటు లేకపోవడం, అధిక పని భారం వంటివి తమను తీవ్రంగా వేధిస్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. చదువు, భవిష్యత్తు, ఉపాధి గురించిన ఆందోళనలు విద్యార్థుల్లో చాలా సర్వసాధారణమని అధికారులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళనలను పరిష్కరించడం, ఆత్మహత్య భావనలను నివారించడం లక్ష్యంగా ఏర్పడిన ఈ టాస్క్‌ఫోర్స్ అక్టోబరు 31న తన తుది నివేదికను సమర్పించనుంది. ఈ సర్వే వివరాలను అందులో పొందుపరుస్తారు. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబేల్లో ఇద్దరు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న సమయంలో ఈ సర్వే వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
టాస్క్‌ఫోర్స్ నేపథ్యం
గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు ఎన్‌టిఎఫ్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ఈ బృందంలో సైకియాట్రిస్టుతో పాటు పలు రంగాల నిపుణులు ఉన్నారు. సర్వేతో పాటు టాస్క్‌ఫోర్స్ పలు విద్యాసంస్థలను సందర్శించి, సంబంధిత పక్షాలతో పలుసార్లు చర్చలు, సంప్రదింపులు జరిపింది. సంస్థాగత పరిమితులు, భయాందోళనలు ఉన్నప్పటికీ, చాలా చోట్ల విద్యార్థులు తమ భావాల గురించి విస్తృతంగా మాట్లాడారని ఎన్‌టిఎఫ్ తెలిపింది.
వివక్ష, వేధింపులు,..
ఈ ఏడాది ప్రారంభంలో ప్యానెల్ తాత్కాలిక నివేదికను అందజేసింది. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో లోతుగా పాతుకుపోయిన సామాజిక వివక్ష, విస్తృతంగా లైంగిక వేధింపులు ఉన్నాయని విద్యార్థుల అనుభవాల ద్వారా తెలుస్తోందని అందులో పేర్కొంది. మెడికల్, లా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ చూపే లింగ వివక్ష కూడా అధికంగా ఉందని తెలిపింది. విద్యాపరమైన తోడ్పాటు లేకపోవడం, హాస్టళ్లలో కర్ఫ్యూలు, నైతిక పోలీసింగ్ పేరిట విధించే ఆంక్షల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. నీట్–యుజి, జెఇఇ ర్యాంకుల ద్వారా కులం బయటపడటం, అడ్మిషన్లు, గ్రేడింగ్, భాషాపరమైన అంతరాలు, ఫ్యాకల్టీ వైఖరి వంటి అంశాల్లో కుల ప్రాతిపదికన వివక్ష, అవమానాలు ఎదురవుతున్నాయని విద్యార్థుల అనుభవాలు చెబుతున్నాయని ప్యానెల్ వెల్లడించింది.







కామెంట్‌లు (0)