బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపారా మెడికల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

12 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎన్‌‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని పారా మెడికల్‌, అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ ‌చేసింది. మంగళవారం విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి వైస్‌ఛాన్సలర్‌ పి చంద్రశేఖర్‌ సమయం కేటాయించకుండా మరో సమావేశానికి వెళ్లిపోవడం బాధాకరమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రవి, సహాయ కార్యదర్శి అక్బర్ విమర్శించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన పారా మెడికల్‌, అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కోర్సులు యూనివర్సిటీ పరిపాలనా, విద్యా వ్యవహారాల్లో జరుగుతున్న జాప్యాల కారణంగా దాదాపు ఆరేళ్లకు చేరుకున్నాయన్నారు. పరీక్షలు సకాలంలో నిర్వహించకపోవడం, ఫలితాల విడుదలలో జాప్యం, స్పష్టమైన అకడమిక్‌ క్యాలెండర్‌ లేకపోవడంతో విద్యార్థులు విలువైన సంవత్సరాలను కోల్పోతున్నారని తెలిపారు. 2021 బ్యాచ్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సు పూర్తయిన అనంతరం తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ పేరుతో విద్యార్థులను ఆస్పత్రుల్లో పోస్టింగులకు పంపుతున్నప్పటికీ ఎలాంటి స్టైఫండ్‌ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. వైద్య రంగంలో కీలక సేవలు అందిస్తున్న విద్యార్థుల శ్రమకు గుర్తింపుగా ఇంటర్న్‌షిప్‌ కాలంలో నెలకు రూ.15 వేల స్టైఫండ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2021 బ్యాచ్‌ ఇప్పటికే పూర్తి చేసిన ఇంటర్న్‌షిప్‌ కాలానికి కూడా అదే మొత్తాన్ని బకాయిగా చెల్లించాలని కోరారు. తక్షణమే ప్రొవిజనల్‌ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పారా మెడికల్‌, అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ విద్యార్థులతో చర్చించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు రంగప్ప, సమీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుమాంజలి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్