శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పారా మిలటరీ దళాలు ఏర్పాటు చేయాలి : వైసిపి అప్పీల్

1 గంట క్రితం

local
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–అమరావతి : స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు రాష్ట్రంలో పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేయాలని వైసిపి మరోసారి హైకోర్టును కోరింది. అధికార పార్టీ నేతలు నామినేషన్ల దాఖలును అడ్డుకుంటూ, దాడులకు పాల్పడుతున్నారని, పారా మిలటరీ దళాలను మోహరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి సానుకూల ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వైసిపి అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై శనివారం రాత్రి జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. వైసిపి దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించి, అందులోని అంశాలపై కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకు సమయం కావాలని కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

అదనపు నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిల్‌

స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని, అదనపు నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని హైకోర్టును వైసిపి ఆశ్రయించింది. జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి లేదా ఆర్‌‌డిఒ వద్ద నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనను సింగిల్‌ జడ్జి తిరస్కరించడంతో శనివారం హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ గంధం సునీతతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఆ వివరాలను పరిశీలించేందుకు సమయం కోరగా, ధర్మాసనం విచారణను ఆదివారానికి వాయిదా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్