- పేదల కాలనీల పట్ల నిర్లక్ష్యం
- శివారు ప్రాంతాలు, దళితవాడల్లో మౌలిక సదుపాయాలు కరువు
- విఎంఆర్డిఎ నిధుల ఖర్చుపైనా ప్రశ్నలు
- ఎన్నికల వేళ ప్రజాసమస్యలపై ఓటర్లలో చర్చ
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం విస్తరిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో జనాభా సుమారు 3.40 లక్షల మంది ఉన్నారు. కానీ, పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మాత్రం అందడం లేదు. వేసవిలో తాగునీటి కష్టాలు.. వర్షం పడితే ముంపు ఇబ్బందులు.. విస్తరణకు నోచుకోని రహదారులు.. అధ్వానంగా మారిన కాలువలు.. శివారు ప్రాంతాలు, పేదల కాలనీల్లో కానరాని వసతులు ఇవి.... నగరవాసులను వెంటాడే సమస్యలు. నగర అభివృద్ధికి నిధులు ఖర్చవుతున్నా సామాన్యుల నివాస ప్రాంతాల పరిస్థితి ఎందుకు మారడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నగర పాలక సంస్థ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారాలకంటే ప్రజా సమస్యలే చర్చనీయాంశంగా మారాయి.
మూడు లక్షల జనాభాకు అవే నీటి పథకాలా?
దాదాపు మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన నెల్లిమర్ల, మధుపాడ నీటి పథకాలపైనే నగరం తాగునీటికి ఆధారపడుతోంది. అప్పటితో పోలిస్తే జనాభా సంఖ్య రెట్టింపైనా సరఫరా వ్యవస్థలో మాత్రం తగిన మార్పులు లేవు. కొన్నేళ్లుగా రోజు విడిచి రోజు నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త నీటి వనరులు, నిల్వ సామర్థ్యం, పైపులైన్ల విస్తరణపై పాలకులు స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాల్సి ఉంది.
వర్షం వస్తే నగరమంతా ముంపే
చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయ పరిసరాలూ చెరువులను తలపిస్తున్నాయి. మురుగునీరు, వర్షపు నీరు వెళ్లేందుకు సమగ్ర కాలువల వ్యవస్థ లేకపోవడం సమస్యను తీవ్రం చేస్తోంది. మూడు లాంతర్లు–గంటస్తంభం–కన్యకాపరమేశ్వరి కోవెల జంక్షన్– కలెక్టరేట్ నుంచి గూడ్స్షెడ్ వైపు రహదారుల విస్తరణ అవసరమని ప్రజలు కోరుతున్నారు.
విఎంఆర్డిఎ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి?
నగర అభివృద్ధికి విశాఖ మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కోట్లాది రూపాయల నిధులు కేటాయించినా, వాటి ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకూ సమానంగా అందడం లేదన్న విమర్శలున్నాయి. సుమారు 80 పార్కులున్నాయని చెబుతున్నా, ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నవి ఎన్ని అన్నది ప్రశ్నగానే మిగిలింది. పెద్దలు, ఉద్యోగులు ఉంటున్న కాలనీల్లో రహదారులు వేస్తున్న పాలకులు పేదలు నివాసముంటున్న కాలనీల్లో మాత్రం మౌలిక సదుపాయాలకు ఈ నిధులను ఖర్చు చేయడం లేదు. నగర నడిబొడ్డున ఉన్న తోటపాలెం వైఎస్ ఆర్ కాలనీయే ఇందుకు ఉదాహరణ. కాలనీ ఏర్పాటై 15 ఏళ్లయినా నేటికీ పూర్తిస్థాయిలో రహదారులకు నోచుకోలేదు. ఆ పక్కనే ఉన్న ఒక అపార్టుమెంట్కు లక్షల రూపాయలతో రహదారి వేయడం పట్ల కాలనీ వాసులు ప్రస్తావిస్తున్నారు. ఇఎంఆర్డిఎ ప్రచురించిన ప్రాజెక్టుల జాబితాలో గంటస్తంభం రహదారి విస్తరణకు రూ.3.03 కోట్లు, దాసన్నపేట రింగురోడ్డు విస్తరణకు రూ.12 కోట్లు, ఇతర రహదారులు, పార్కు, పెద్దచెరువు అభివృద్ధి పనులకూ నిధులు పేర్కొన్నారు. ఈ జాబితాలోని పనుల అంచనా వ్యయాల మొత్తం సుమారు రూ.25.69 కోట్లు.
విలీన ప్రాంతాలు, దళితవాడలపై నిర్లక్ష్యమెందుకు?
జమ్ము, కెఎల్ పురం, ధర్మపురి, అయ్యన్నపేట వంటి విలీన ప్రాంతాల్లో తాగునీరు, కాలువలు, వీధి దీపాల సమస్యలు కొనసాగుతున్నాయి. లంకాపట్నం, జొన్నగుడ్డి, రాళ్లమాలపల్లి, వీటిఅగ్రహారం ఎస్సి కాలనీ, స్వీపర్ కాలనీల్లోనూ రహదారులు, పారిశుధ్య సదుపాయాల కొరతపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణా నగర్, ఎల్బిజి నగర్, గురజాడ నగర్, వినాయక్ నగర్ వంటి కాలనీల్లోనూ ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
హామీలకు లెక్కలు చెప్పాలి!
ఎన్నికల సమయంలో అభివృద్ధి హామీలు ఇవ్వడం సహజం. కానీ రోజూ తాగునీరు అందించడం, ముంపును నివారించడం, రహదారులు వేయడం, దళితవాడలు, శివారు కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రాధాన్యంగా ఉండాలి. కొత్త ప్రకటనలతో కాదు.. ప్రాంతాలవారీ నిధుల లెక్కలు, గడువుతో కూడిన కార్యాచరణతోనే నగర అభివృద్ధిపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.








కామెంట్లు (0)