విద్యార్థి, యువజన సంఘాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల న్యాయమైన పోరాటంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిందలు వేసి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని విద్యార్థి, యువజన సంఘాల రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. దేశమంతా విద్యార్థులకు ప్రజలు అండగా నిలుస్తున్నారని, దానిని సహించని పవన్ విద్యార్థుల పోరాటాన్ని విచ్ఛిన్నకర శక్తులుగా బోధించడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు కె ప్రసన్న కుమార్ (ఎస్ఎఫ్ఐ), జి వలరాజు (ఎఐఎస్ఎఫ్), ఎం వినోద్ (పిడిఎస్‌యు), సురేష్ (పిడిఎస్‌ఒ), నాగార్జున (ఐసా), కిరణ్ (పిడిఎస్‌యు), శ్రీనివాస్ (ఎన్ఎస్‌యుఐ), ఎం నరేంద్ర (పిఎస్‌యు), కుమార్ (ఎఐఎఫ్‌డిఎస్), మహేష్ (ఎఐడిఎస్) జి రామన్న (డివైఎఫ్ఐ), యుగంధర్ (ఎఐవైఎఫ్), భూషణం (పివైఎల్) ఉమ్మడిగా శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ లీక్ చేసిన పాపాత్ములపై ఒక్క మాట కూడా మాట్లాడని పవన్‌కు విద్యార్థులను విమర్శించే హక్కు లేదని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడిని సమాజం మొత్తం ఖండిస్తుందని తెలిపారు. విద్యార్థుల పోరాటం ఉధృతంగా మారుతున్న క్రమంలో, అనేక మంది మేధావులు, ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్న తరుణంలో ప్రభుత్వానికి భయం పట్టుకుని బిజెపికి అనుకూలంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనమని పేర్కొన్నారు. తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బంద్ విజయవంతం
రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ శుక్రవారం విజయవంతంగా జరిగిందని వెల్లడించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా భాగస్వామ్యం అయ్యారని పేర్కొన్నారు. బంద్‌లో పాల్గొన్న విద్యార్థులకు, సహకరించిన విద్యావేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నిచోట్ల విద్యార్థి సంఘాల నేతలను అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో విద్యార్థి సంఘం నేతలను ఈడ్చుకుంటూ, పిడిగుద్దులు గుద్దిన పోలీసుల తీరును తప్పుబట్టారు.








కామెంట్‌లు (0)