ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గుంటూరు కృష్ణబాబుకాలనీలో ఓ మహిళను బహిరంగంగా వివస్త్రను చేసి, సామూహికంగా దాడి చేసిన అమానవీయ ఘటనను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉండడమే కాకుండా మహిళల భద్రత, గౌరవానికి పెను ముప్పుగా నిలిచిందని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కె.శ్రీదేవి, వి.సావిత్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపాటి వివాదాన్ని సాకుగా చేసుకుని ఓ మహిళపై గుంపుగా దాడి చేసి, ఆమె దుస్తులు చించి నడిరోడ్డుపై అవమానించడం అత్యంత దారుణమైన, క్రూరమైన చర్యగా అభివర్ణించారు. బాధితురాలు ఎంత వేడుకున్నా కనికరం చూపకుండా ఆమె ఆత్మగౌరవాన్ని కాలరాయడం మానవత్వానికే మచ్చని తెలిపారు.ఈ ఘటన మహిళలపై పెరుగుతున్న హింసకు, చట్టాల పట్ల నేరస్థుల్లో నెలకొన్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై ఎలాంటి రాజకీయ, సామాజిక, ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వేగవంతమైన దర్యాప్తు చేపట్టి, ప్రత్యేక న్యాయస్థానం ద్వారా త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలికి సంపూర్ణ భద్రత, వైద్య చికిత్స, న్యాయ సహాయం, మానసిక పునరావాసం, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మహిళలపై ఇలాంటి అమానవీయ దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, నిందితులకు కఠిన శిక్షలు విధించడం ద్వారా సమాజానికి బలమైన హెచ్చరిక అని, మరల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
మహిళల గౌరవాన్ని కాలరాసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 10:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)