శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చీకటి చెరలోనే స్వాతంత్ర్యం

1 గంట క్రితం

freedom
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అర్థరాత్రి దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం

ఎనిమిది దశాబ్దాలుగా

చీకటిలోనే తడబడుతూ

వెలుగు జాడను వెతుక్కుంటోంది!


తన నుండి స్వేచ్ఛను వేరుచేసి

నిరంకుశత్వం పెట్టెలో

హక్కుల్ని దాచేసి

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న

పాలకుల్నీ, వారి పాలననీ

చూసిచూసి రగిలిపోతోంది !


కూడు, గూడూ లేని కోట్లమంది అభాగ్యులు

కులమతాల రావణకాష్టంలో

ఇప్పటికీ సమిధులవుతున్న అమాయకులు

ఇదా స్వాతంత్ర్యమని

నిలదీసిన ప్రతిసారీ

తన నిస్సహాయతకు

తానే సిగ్గు పడుతోంది!


చట్టాలని జేబు రుమాళ్లులా

వాడుకుంటున్న నాయకులు

వారిచుట్టూ తోకాడిస్తూ

ప్రదక్షిణ చేస్తున్న వ్యవస్థలు

రాజ్యాన్ని భోజ్యంగా మార్చుకుంటుంటే

బాధతో నిట్టూరుస్తోంది!


ఏడాదికోసారి పంద్రాగస్టు రోజున

తనను గుర్తుచేస్తూ

చేసే ఆర్భాటాలు, అసత్య ప్రసంగాలు

తన ఉనికిని ప్రశ్నిస్తూ పరిహసిస్తుంటే

అవమానంతో కుంగిపోతోంది!


ఎగరేసే జెండాలో తానున్నానని

సగర్వంగా చెప్పే రోజు కోసం

దశాబ్దాలుగా

ఎదురుచూస్తున్న స్వాతంత్ర్యానికి

నిరాశే మిగులుతోంది!


శిరమెత్తిన యువతరం శివమెత్తి

అంతరాల గోడల్ని కూల్చేసి

వెనుకబాటు నుదుటి రాతల్ని చెరిపేసి

చీకటి దారులు దాటేస్తే

ప్రగతిరథానికి బాటేస్తే

దేశానికి మేలిమలుపు అవుతుంది!


నవభారతం సాకారమయ్యే

ఆ రోజు కోసమే

స్వాతంత్ర్యమూ ఎదురుచూస్తోంది!


ధవళేశ్వరపు రవికుమార్,

సెల్: 9848712197


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్