శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కోతపడిన భారత రిపబ్లిక్

1 గంట క్రితం

consti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఏడేళ్ల క్రితం, 2019 ఆగస్టు 5న, మన రిపబ్లిక్ తన శరీరాంగాల్లో ఒకదానిని చడీచప్పుడు లేకుండా కత్తిరించి తొలగించింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉండి, దాని నాయకులు గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు, ఫోన్ లైన్లు పని చేయనప్పుడు, సంప్రదించడానికి ఎటువంటి శాసనసభ లేని సమయంలో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఎ రద్దు చేయబడ్డాయి. స్వయంగా సంతకం చేసిన విలీన పత్రం ద్వారా భారతదేశంలో చేరిన ఒక పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఆర్టికల్ 370ని చట్టవిరుద్ధంగా రద్దు చేయడానికి ముందు ఆ రాష్ట్రం దేశంలో భాగమే కానట్లుగా, రాష్ట్ర అక్రమ విభజనను 'సమైక్యత'గా అభివర్ణిస్తూ అధికార పార్టీ గొప్పగా ప్రచారం చేసుకున్నది. ఈ చర్యలన్నీ సంస్కరణల భాషతో కప్పబడి, ఎవరి అనుమతీ లేకుండా ఒక ఆర్డినెన్స్ ద్వారా అమలు చేశారు. ​ తర్వాతి సంవత్సరాల్లో, ఆ ప్రాంతం వీధి సైనిక బలగాల నీడలో గడిపింది. 'సెక్యూరిటీ క్లియరెన్స్' పేరిట చెల్లుబాటు కాని ఒక సాకుతో ఆ రాష్ట్ర యువతీ యువకులకు ఉద్యోగాలు నిరాకరించారు. ఉపా, పిఎస్‌ఎ వంటి అత్యంత నిర్బంధ చట్టాల కింద విలేకరులను జైలులో పెట్టారు. ఢిల్లీ ప్రభుత్వం కాశ్మీర్ లో 'సాధారణ పరిస్థితి' నెలకొన్నదని సంబరాలు చేసుకుంటుంటే, అక్కడి యాపిల్ రైతులు, దినసరి కూలీలు బతుకుదెరువు కోసం అష్టకష్టాలూ పడ్డారు.​

2019లోనే ఈ పరిస్థితి మొదలయిందని సిపిఎం భావించడం లేదు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వమైన కేరళలోని మా ప్రభుత్వాన్ని...1959లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 356ను బాహాటంగా దుర్వినియోగం చెయ్యడం ద్వారా... రద్దు చేసింది. ఆ గాయాన్ని మేము ఆరు దశాబ్దాలకు పైగా గుర్తుచేస్తూనే ఉన్నాము. అయితే కాంగ్రెస్ ఒక ముతక ఆయుధాన్ని ఉపయోగించగా, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ప్రతి ఎన్నికల లేదా న్యాయపరమైన తీర్పునకు వ్యతిరేకంగా ఒక ఆధునిక సర్జికల్ కత్తి లాంటి ఆర్డినెన్స్‌నో, బిజెపి యేతర పాలనలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ తమకు అనుకూలమైన గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లనో అడ్డం పెట్టుకున్నది. ​

కాశ్మీర్ లో 2024లో జరిగిన ఎన్నికలను కేంద్ర ప్రభుత్వ ఉదారతగా ఎవరూ భావించనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ రాష్ట్ర హోదాపై, ఎన్నికల నిర్వహణపై ఐదేళ్లపాటు కాలయాపన చేసింది. ఇక ఆలస్యం చేయడానికి వీలు లేకుండా సుప్రీంకోర్టు గడువు విధించేసరికి గత్యంతరం లేక ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి డబ్బు, నకిలీ ఓటర్లు, మత, ప్రాంతీయ ప్రాతిపదికన విభజించే ప్రయత్నాలతో సహా అన్ని అనైతిక చర్యలకూ పాల్పడ్డారు. కానీ బిజెపి రూపుకట్టదలిచిన కాశ్మీర్‌కు, ఆగస్టు 5 నాటి అనాలోచిత చర్యలకు వ్యతిరేకంగా, చర్చలకు బదులు తమపై ఆధిపత్యం చెలాయించడానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

అయితే, స్పష్టమైన ప్రజా తీర్పు వున్నప్పటికీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా తన సొంత అధికారులను బదిలీ చేసే ప్రాథమిక అధికారాలు కూడా లేవు. ఆయన అధ్యక్షత వహించాల్సిన కమిటీలకు కూడా హాజరయ్యే అవకాశం కల్పించడం లేదు. అదే సమయంలో, ఢిల్లీకి మాత్రమే జవాబుదారీగా ఉండే ఒక ఎన్నిక కాని అధికారి ( లెఫ్టినెంట్ గవర్నర్ )... ముఖ్యమంత్రికి బదులుగా పోస్టింగులు, పోలీసు వ్యవస్థ, భూ కేటాయింపులు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒమర్ అబ్దుల్లా ఏ అధికారాలు లేని అలంకారప్రాయమైన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఆ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం, ఎందుకంటే ఇది కేవలం పిర్ పంజాల్ ప్రాంతానికే పరిమితం కాదు. ప్రజా తీర్పును వమ్ము చేసే మార్గాలు ఏమిటో తెలుసుకునేందుకు జమ్ము కాశ్మీర్ ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. పార్లమెంటులో ఓటింగ్‌ ఎదుర్కొనే ప్రమాదం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బలహీనపరచవచ్చో చూపించే సాధనాలు వారి దగ్గరున్నాయి. మొదటి రెండు సాధనాలు సరిపోనప్పుడు ఆర్డినెన్స్‌లు, గవర్నర్లు, కేంద్ర ఏజెన్సీలను రంగంలోకి దించడం ఇందులో భాగం. ఢిల్లీలో కూడా 2015, 2023లో రెండుసార్లు జరిగింది ఇదే. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి అధికారులను ఎంపిక చేసుకునే హక్కు ఉండాలని సుప్రీంకోర్టును ఆశ్రయించి అందుకనుగుణంగా తీర్పు తెచ్చుకుంటే, దానిని పూర్వపక్షం చేసేలా కొన్ని రోజుల్లోనే మోడీ ప్రభుత్వం ఆర్డినెన్సులు తీసుకు వచ్చింది.

న్యాయవ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ తీర్పు ఇచ్చినా, ఎన్నికలలో ప్రజలు బిజెపి ని తిరస్కరించినా ఆ తీర్పులను తిప్పికొట్టేందుకు తగిన చట్టాలు చేయడంలో బిజెపి ప్రభుత్వం నైపుణ్యం సాధించింది. దీనిని నిరసించే హక్కును కూడా నియంత్రించడం మరింత ఆందోళనకరమైన విషయం. ఒకవైపు ఈ ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ ప్రజలకు అన్ని విధాలా మద్దతు ఇస్తున్నామని పేర్కొంటుంది. మరొకవైపు అదే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు రాష్ట్ర హోదా కావాలన్న రాజ్యాంగబద్ధమైన డిమాండ్ కోసం జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేయడానికి అనుమతి అడిగితే ఇవ్వదు. బిజెపి ప్రభుత్వానికి తాను సాధించిన రికార్డుపై నమ్మకం ఉంటే, ప్లకార్డులను కూడా అణచివేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన రోజు నుండి సిపిఎం ఈ అంశంపై దృఢమైన వ్యతిరేకత ప్రదర్శిస్తూనే వచ్చింది. మా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ సీతారాం ఏచూరి జమ్ము కాశ్మీర్ లో విధించిన దిగ్బంధనాన్ని ధిక్కరించడానికి ప్రయత్నించిన తొలి ప్రతిపక్ష నాయకుడు. మా కేంద్ర కమిటీ సభ్యుడు, కామ్రేడ్ యూసుఫ్ తరిగామి కాశ్మీర్ ప్రజల బలమైన గొంతుకలలో ఒకరిగా నిలిచి వారి పోరాటాలలో తోడుగా ఉన్నారు. 2022, 2025 లలో కన్నూర్, మధురైలలో జరిగిన మా 23వ, 24వ పార్టీ అఖిల భారత మహాసభలు, జమ్ము కాశ్మీర్ కు తక్షణమే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజల రాజ్యాంగ హక్కులన్నింటినీ పునరుద్ధరించాలని, శాశ్వత నివాసితుల నుండి తొలగించబడిన భూమి, ఉద్యోగ రక్షణలను తిరిగి కల్పించాలని, రాజకీయ ఖైదీలు, విలేకరులను విడుదల చేయాలని, తప్పుడు ఆరోపణలతో కాశ్మీరీ యువతపై జరుగుతున్న వేధింపులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశాయి.

​ మేము ఈ రాజకీయ సంకల్పాన్ని నికరంగా ముందుకు తీసుకెళ్లాము. రాష్ట్ర ప్రశాంతతకు భంగం కలిగిన ప్రతిసారీ, ప్రతి కొత్త అరెస్టు తర్వాత, బిజెపి ని ఓడించి ఎన్నికల్లో గెలిచిన నేరానికి గానూ అక్కడి ప్రజా ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రతి అవమానం సందర్భంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నాము.

ఇక్కడ ప్రమాదంలో పడింది ఏదో ఒక కేంద్రపాలిత ప్రాంత హోదా మాత్రమే కాదు. ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రణాళికాబద్ధంగా ఒక ఆర్డినెన్సు ద్వారా బలహీనపరిచిన ప్రతిసారీ, రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య దూరం మరింత పెరుగుతున్నది. ఆ నమ్మకాన్ని మళ్లీ సులభంగా పునరుద్ధరించలేము. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్యగా రూపొందింది. ఢిల్లీ వాటిపై ఆధిపత్యం చెలాయించడం కాదు. వాటితో కలిసి పరిపాలిస్తుందనే నమ్మకంతో నిర్మితమైంది. జమ్ము కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న మా డిమాండును మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. ఓటు వేసిన ప్రజలకు అధికారాన్ని తిరిగి ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకూడదు. రాజ్యాంగబద్ధమైన హక్కును ఏదో దయతో ఇస్తున్నామన్న వైఖరిని కేంద్ర ప్రభుత్వం వీడాలి. ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా ఈ కనీసమైన అవగాహనను గుర్తుచేసుకోవాల్సి రావడమంటే ఇప్పటికే మనం ప్రజాస్వామ్యాన్ని ఎంతగా కోల్పోయామో గుర్తించి సిగ్గుపడాలి.


- వ్యాసకర్త : ఎం.ఎ. బేబీ , సిపిఎం ప్రధాన కార్యదర్శి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్