32 కిలోమీటర్లు నడక
ప్రజాశక్తి - వేపగుంట (విశాఖపట్నం) : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణ మహోత్సవానికి యాత్రికులు మంగళవారం పోటెత్తారు. ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకొని ఏటా నిర్వహించే ఈ సింహగిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచీ యాత్రికులు తరలివచ్చారు. దీంతో విశాఖ నగరంలోని ప్రధాన రహదారులన్నీ సింహాచలం వైపు మళ్లాయి. యాత్రికులు 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు తేలికపాటి జల్లులు కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చల్లబడిన వాతావరణం యాత్రికులకు అనుకూలంగా ఉండటంతో సుమారు ఎనిమిది లక్షలకు పైచిలుకు యాత్రికులు రానున్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాత్రికుల రద్దీ మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకే మూడు లక్షల మందికి పైగా ప్రదక్షిణకు బయలుదేరినట్టు ప్రాథమిక అంచనాలున్నాయి. గిరి ప్రదక్షిణలో అత్యంత విశిష్ట ఘట్టమైన స్వామివారి పుష్ప రథోత్సవాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సంప్రదాయబద్ధంగా జెండా ఊపి ప్రారంభించారు. రథయాత్ర ప్రారంభానికి ముందు తొలి పావంచా వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశోక్ గజపతిరాజు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకట్రావు రథయాత్రను ప్రారంభించారు. అనంతరం వేలాది మంది యాత్రికుల నడుమ మంగళ వాయిద్యాలు, నాదస్వరాలు, డోలు, కేరళ చెండమేళం నడుమ పుష్పరథం ముందుకు కదిలింది. పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యాత్రికులు భారీగా తరలిరావడంతో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.








కామెంట్‌లు (0)