బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభోగాపురం విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వానికి రండి

2 గంటల క్రితం

HN0VN7yb0AAKlnh.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్ర‌ధాని మోడీకి సిఎం చంద్ర‌బాబు ఆహ్వానం

  • కేంద్ర మంత్రుల‌తో భేటీ

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆహ్వానించారు. బుధ‌వారం నాడిక్క‌డ పార్ల‌మెంట్‌లోని ప్ర‌ధాన‌ మంత్రి కార్యాల‌యంలో ప్ర‌ధాని మోడీతో సిఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆగస్టు ఒకటిన జరగబోయే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్స‌వానికి ప్ర‌ధానిని ఆహ్వానించారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించే అవకాశం నాకు లభించింది. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా నిర్మించిన ఈ విమానాశ్రయం, ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తితో కూడిన శాశ్వత వారసత్వానికి నివాళిగా నిలుస్తుంది’ అని సిఎం పేర్కొన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన, సంస్కరణల ఆధారిత నాయకత్వంలో దేశ పౌర విమానయాన రంగం ఒక అద్భుతమైన పరివర్తనను చూసింది. విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి, సరసమైన ధరలకు తీసుకురావాలన్న ఆయన దార్శనికత, మన ప్రజల్లో లక్షలాది మందికి ఎగరాలన్న వారి కలను సాకారం చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర ఆకాంక్షలకు రెక్కలు అందించి, అనుసంధానం, పర్యాటకం, వాణిజ్యం, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఆయన నాయకత్వంలో దేశం వికిసిత భారత్ లక్ష్యం వైపు స్థిరంగా పురోగమిస్తోంది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడంతో ఈ ప్రయాణానికి అర్థవంతంగా తోడ్పడటానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది’ అని అన్నారు. అనంతరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్, ఏవియేషన్ విశ్వవిద్యాలయం, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఏవియేషన్ హబ్, విద్యా సంస్థలను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారం భోత్సవ వేడుకలను ఘనంగా, చారిత్రాత్మకంగా నిర్వహించాలి’ అని సిఎం చంద్రబాబు సూచించారు.

​కేంద్ర మంత్రులతో భేటీ

కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో సిఎం చంద్ర‌బాబు స‌మావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన న‌దీ జ‌లాలు, సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, జల నిర్వహణకు సంబంధించిన అనేక ముఖ్యాంశాలపై చ‌ర్చించారు. కేంద్ర ప్రభుత్వం దేశ జల వనరుల సమర్థవంతమైన, సమన్వయపూర్వక, పారదర్శక, దీర్ఘకాలిక వినియోగం కోసం కట్టుబడి ఉన్నదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ భావంతో నిరంతరం ప్రయత్నాలు చేస్టున్నట్లు తెలిపారు. కేంద్రం నేతృత్వంలో రాష్ర్టానికి సంబంధించిన జల వనరుల అంశాలను ప్రాధాన్యానుసారంగా పరిష్కరించేలా, రాష్ట్రంలో జలసురక్ష, వ్యవసాయాభివృద్ధి పెంపొందించడానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పియూష్ గోయల్‌తో సిఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య రంగంలో మత్స్యకారుల సంక్షేమం, కొత్త రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, సంబంధిత అంశాలపై చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి వివరంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపిలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, హరీష్ బాలయోగి, బీదా మస్తాన్ రావు, క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు, భ‌ర‌త్‌ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్