- కెవిపిఎస్ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలో క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం సిగ్గుచేటని, ఇది రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికే మాయని మచ్చ అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘నా చావుకు సీఐ నాగరాజే కారణం’ అని నేను మాదిగ కులంలో చేసిన తప్పు అని క్రాంతికుమార్ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులైతే, ఈ కేసులో ఆలస్యం ఎందుకు జరుగుతోందో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులు, రైతులు, మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ నాయకులు పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా అసభ్యకరమైన, ద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తగిన క్రమశిక్షణా చర్యలు ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ప్రశ్నించే వారిని, ప్రజలను చైతన్యం చేసే వారినే టార్గెట్ చేసి కేసులు నమోదు చెయ్యడం, ఉపా కేసులు పెట్టడం సిగ్గు చేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుని సి ఐ నాగరాజు పై ఎస్ సి, ఎస్ టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)