ప్రజాశక్తి - మైదుకూరు : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరిపారు. గురువారం తెల్లవారుజామున దువ్వూరు మండలం జగనన్న కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో జాకీర్ గాయపడగా, ఓ పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో జాకీర్ నిందితుడిగా ఉన్నాడు. కొంతకాలంగా పరారీలో ఉన్న అతడు దువ్వూరు మండలం జగనన్న కాలనీలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో చాపాడు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని జాకీర్ కోసం తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో జాకీర్ పోలీసులకు ఎదురుపడినట్లు, అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పోలీసులపై తిరగబడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జాకీర్‌కు గాయాలయ్యాయి. అదే సమయంలో ఓ పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.
గాయపడిన జాకీర్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)