దర్యాప్తునకు యుఇఇయు డిమాండ్
ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : విజయవాడ విద్యుత్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ సొసైటీలో 2012 నుంచి జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (యుఇఇయు) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లు భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొసైటీ నిధులను దుర్వినియోగం చేసి సుమారు రూ.80 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపించింది. విజయవాడ బాలోత్సవ భవన్‌లో యుఇఇయు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డి సూరిబాబు, పి సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నిధులను పాలకవర్గంలో ఉన్న కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవడం దారుణమన్నారు. సొసైటీ సభ్యత్వం లేని, సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న ఉద్యోగులకు సైతం రూ.లక్షలు రుణాలు తీసుకున్నట్లు నోటీసులు జారీ చేయడం మరింత ఆందోళనకు గురిచేస్తోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని, బాధిత ఉద్యోగుల డబ్బును రికవరీ చేసి వారికి తిరిగి అందించాలని కోరారు. అవినీతికి పాల్పడిన వారి ఆస్తులను గుర్తించి, అవసరమైతే జప్తు చేసి సొమ్మును రికవరీ చేయాలన్నారు. విద్యుత్ సంస్థ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సొసైటీలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా ఉంటే తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సొసైటీ బాధితులకు న్యాయం జరిగే వరకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో యుఇఇయు ఎపిసిపిడిసిఎల్ డిస్కం అధ్యక్ష, కార్యదర్శులు డి వెంకటేశ్వరరావు, ఎ రాజు, రాష్ట్ర నాయకులు నాయబ్ రసూల్, ఎపి పవర్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం మోహనరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిటీ జోన్ అధ్యక్షులు పి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)