ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ డెయిరీపై రాజకీయ పెత్తనం

22 గంటల క్రితం

vadde
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 08:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- -ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు

- ముగ్గురు మంత్రులతో ఒత్తిడి తెచ్చి ఛైర్మన్ ను రాజీనామా చేయిస్తారా..?

- రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ​: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులతో అనారోగ్య పరిస్థితుల్లో పోలీసు బందోబస్తు మధ్య బలవంతంగా రాజీనామా చేయించడం దారుణమని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రేశ్వరరావు మండిపడ్డారు. ముగ్గురు మంత్రులతో ఒత్తిడి తెచ్చి చైర్మన్‌ను తప్పించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా మిల్క్ యూనియన్ సోసైటీ ఛైర్మన్ గా చలసాని ఆంజనేయులును ప్రజాస్వామ్యం బద్ధంగా, ఎన్నికల రూపంలో ఎన్నిక జరిగి ఛైర్మెన్ గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడన్నారు. బుడమేరు నీరు, అధికంగా వర్షపాతంతో మిల్క్ ప్లాంట్ మునకకు గురౌతుంటే వీరవల్లి దగ్గర మరో ప్లాంట్ నిర్మాణాన్ని చేశారన్నారు. కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లానే కాకుండా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాల సేకరణ చేపట్టారని అభినందించారు. పాల ఉత్పత్తుల వ్యాపారాభివృద్ధి తెలంగాణ,ఎపి రెండు రాష్ట్రాల్లో గణనీయంగా సాగుతుందన్నారు. అటువంటి మిల్క్ యూనియన్ ఛైర్మన్ గా ఎన్నికైన ఆంజనేయులను బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయించడం సమజసం కాదన్నారు. ఎపి రైతు సంఘం నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ సహకార సోసైటీని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సహకార వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమాలు చేపట్టారని విమర్శించారు.దీంట్లో భాగంగానే సహకార వ్యవస్థలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు, విశాఖపట్నం పాల సొసైటీని నాశనం చేశారని విమర్శించారు. ఆ సోసైటీని నాశనం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ఉత్పత్తుల సంస్థను లాభల బాటలో నడిపించటమే ధ్యేయంగా పెట్టుకుని, సహకారం వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేక రుల సమావేశంలో కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. యల్లమందరావు, కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొలనుకొండ శివాజీ, ఎఐకెఎస్ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్, ఎఐకెఎస్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, పాల రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, ఎఐకెఎఫ్ రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు, కిసాన్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్