బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపారదర్శకంగా ​స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి

7 గంటల క్రితం

​స్థానిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి 
- రాజకీయ పార్టీల విజ్ఞప్తి
- సిసి టివిలు, వెబ్‌కాస్టింగ్‌తో పటిష్ట చర్యలు
- సర్టిఫికెట్ల జారీలో జాప్యం నివారించేలా తక్షణ ఆదేశాలు 
- ఎస్ఇసి అనిల్ చంద్ర పునేఠా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:42 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సిసి టివిలు, వెబ్‌కాస్టింగ్‌తో పటిష్ట చర్యలు

  • సర్టిఫికెట్ల జారీలో జాప్యం నివారించేలా తక్షణ ఆదేశాలు

  • ఎస్ఇసి అనిల్ చంద్ర పునేఠా

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత సాధారణ పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాను పలు రాజకీయ పార్టీలు కోరాయి. పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని జిల్లా యంత్రాంగాలకు తక్షణ ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం కార్యాలయ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం గుర్తించిన 20 రాజకీయ పార్టీలకు సమావేశానికి ఆహ్వానం పంపగా, 19 పార్టీల ప్రతినిధులు హాజరై తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో సిసిటివి నిఘా ఉండాలని, మద్యం ప్రవాహాన్ని నియంత్రించాలని రాజకీయ పార్టీలు సూచించినట్లు తెలిపారు. పండగ రోజులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూల్‌ రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పారు. కలెక్టరేట్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం కష్టమన్నారు. ఆన్‌లైన్‌లో నామినేషన్లు దాఖలు చేసే విధానం అమలుపైనా వచ్చిన సూచనను పరిశీలిస్తామన్నారు. సున్నిత, అతి సున్నిత, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పారా మిలిటరీ బలగాలను మోహరించాలన్న ప్రతిపాదనలను పోలీసుశాఖకు పంపిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను గెజిట్‌ రాగానే వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి ఎ మల్లికార్జున పాల్గొన్నారు.

ప్రశాంతంగా నిర్వహించాలి : వైవి, సిపిఎం

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను దసరా పండగ తర్వాతే ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎన్నికలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలతో కొద్ది రోజుల ముందు సమావేశం నిర్వహించకుండానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవడం సరైన పద్ధతి కాదన్నారు. దసరా నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు తగిన సమయం ఉండదని, నామినేషన్ల దాఖలుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. గత ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లు సమర్పించే అవకాశం కల్పించాలని కోరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపును అన్ని ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఒకేసారి నిర్వహించాలని కోరారు.

పారా మిలటరీ బలగాలను మోహరించాలి : కన్నబాబు, వైపిసి

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు పారదర్శకత పాటించాలని, సున్నిత ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలను మోహరించాలని వైసిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త కన్నబాబు డిమాండ్‌ చేశారు. కుల ధ్రువీకరణ, నో డ్యూస్‌ సర్టిఫికెట్లను 24 గంటల్లో జారీ చేయాలని, నామినేషన్లకు ప్రత్యామ్నాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

​రిజర్వేషన్లలో అన్యాయాన్ని సరిచేయాలి : మస్తాన్ వలీ, కాంగ్రెస్

​స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో బిసి, ఎస్‌సి, ఎస్‌‌టిలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలీ విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ బిసి, ఎస్‌‌సిలకు ఒక్క స్థానం కూడా రిజర్వు చేయలేదని పేర్కొన్నారు. రిజర్వేషన్లలో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరారు.

పారదర్శక ఎన్నికలకు జనసేన సహకారం : శివశంకర్, జనసేన

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేందుకు జనసేన పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ తెలిపారు. ఎన్నికల వ్యయ పరిమితులపై సూచనలు చేశారు.

​ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి : జగదీష్, సిపిఐ

ఎన్నికల సంఘం పటిష్టంగా వ్యవహరించి, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి జగదీష్ కోరారు. పోలీసు అధికార దుర్వినియోగాన్ని అరికట్టి పారదర్శక ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్