అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి
ఎమ్మెల్యే జీవీ చొరవతో స్వదేశానికి తరలింపు
ప్రజాశక్తి – పల్నాడు : పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (26) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 14న అమెరికాలోని న్యూజెర్సీలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ప్రసన్న మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తరలించేందుకు సహకరించాలని ఆమె తల్లిదండ్రులు మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జీవీ సంబంధిత ఉన్నతాధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేశారు. దీంతో ప్రసన్న మృతదేహం అమెరికా నుంచి ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్వగ్రామమైన ఉమ్మడివరానికి తీసుకువచ్చారు. కుటుంబానికి అండగా నిలుస్తుందనుకున్న కుమార్తె విగతజీవిగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు స్థానికులను సైతం కలచివేశాయి. ఈ విషాద ఘటనతో ఉమ్మడివరం గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ప్రసన్న అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.








కామెంట్‌లు (0)