ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి – విజయవాడ: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల మందులు, వైద్య పరీక్షల ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రజారోగ్య వ్యవస్థకు తగినన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్యాన్సర్ చికిత్సకు అవసరమైన కొన్ని రకాల మందుల గరిష్ట ధరలను తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ నిర్ణయం పరిమిత ప్రయోజనాన్నే కలిగిస్తుందని, బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, మానసిక సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందుల ధరలను కూడా తగ్గించాలని కోరారు. డెంగ్యూ వంటి సాధారణ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందుల ధరలు సైతం అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైద్య రంగం పూర్తిగా వ్యాపారమయంగా మారడంతో మందులు, వైద్య పరీక్షల ఖర్చులు భరించలేక సామాన్య ప్రజలు అప్పులపాలవుతున్నారన్నారు. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ బలహీనపడటంతో ఆరోగ్యశ్రీ పథకం కూడా ప్రజలకు ఆశించిన ప్రయోజనాలను అందించలేకపోతోందన్నారు.
మందుల ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్లో విక్రయిస్తున్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని.. జనరిక్ మందులపై ఒకే గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) ఉన్నప్పటికీ వివిధ దుకాణాల్లో వేర్వేరు ధరలకు విక్రయించడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదన్నారు. మందులు అత్యవసరమైనవి కావడంతో ధరలు అధికంగా ఉన్నప్పటికీ అప్పులు చేసి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మందుల వ్యాపారాన్ని మార్కెట్ శక్తులకే వదిలేయకుండా తక్షణమే ప్రత్యేక మందుల ధరల నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా అన్ని రకాల మందుల ధరలను తగ్గించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల యంత్రాలు, మందులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అన్ని రకాల వ్యాధులకు రోగులందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందించాలని సూచించారు.







కామెంట్లు (0)