మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదళితుల సమస్యలను పరిష్కరించాలి..

1 గంట క్రితం

BALA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 10:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కులవివక్ష లేకుండా చూడాలి

  • దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

  • ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ నిధులతో పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సామాజిక శంఖారావం ప్రతినిధి బృందం కోరింది. మంగళవారం సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రంలో26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఇందులో 660 స్మశాన వాటికలు, 405 ఇళ్ల స్థలాలు, 302 భూసంబంధిత సమస్యలు గుర్తించినట్లు వివరించారు. దళితవాడల్లో ప్రత్యేక శ్మశాన వాటికలు లేకపోవడం, ఉన్న భూములు ఆక్రమణలకు గురికావడం, రహదారులు, విద్యుత్, మంచినీరు, ప్రహరీ, స్నానపు గదులు వంటి సౌకర్యాలు లేకపోవడాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిఒ 1235 ప్రకారం ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక ఏర్పాటు చేసి, ఆక్రమణలను తొలగించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అర్హులకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, కోనేరు రంగారావు కమిషన్ సిఫారసుల మేరకు మిగులు భూములను భూమిలేని దళితులకు పంపిణీ చేయాలని కోరారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి పట్టా ఇచ్చి గృహ నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ ‌సి సబ్‌ప్లాన్ నిధులతో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. దేవాలయ ప్రవేశం, క్షవరం, టీ దుకాణాలు, సామాజిక ప్రదేశాలు, భోజనాల్లో వివక్ష వంటి ఘటనలు కొన్ని ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అంటరానితనాన్ని, కులవివక్షను అరికట్టి బాధితులకు రక్షణ కల్పించాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరారు. టిటిడి ఇఒ, ఛైర్మన్ పదవుల్లో దళితులకు అవకాశం కల్పించడంతో పాటు దేవాలయాల్లో దళిత పూజారుల నియామకానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినిధులు సమర్పించిన నివేదికను పరిశీలించిన మంత్రి, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి సమగ్రంగా నివేదిక ఇచ్చారని అభినందించారు. అవసరమైతే సంబంధిత హాస్టళ్లను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అధ్యయన యాత్రల్లో గుర్తించిన సమస్యలపై ఈ నెల 24న అన్ని జిల్లా కలెక్టర్లకు అర్జీలు సమర్పించాలని మంత్రి సూచించారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి లోకనాధం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మల్యాద్రి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, వృత్తిదారుల సమన్వయ కమిటీ కో-కన్వీనర్ పూసపాటి వెంకటరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్