కార్యకర్తలకు అండగా ఉంటాం : మంత్రి లోకేష్
ప్రజాశక్తి - ఆదోని : యువగళం పాదయాత్రలో ప్రజలు విన్నవించిన సమస్యలను 90 రోజుల్లో పరిష్కరిస్తామని, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి ఆదోనిలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మీనాక్షి నాయుడు అధ్యక్షతన జరిగింది. మంత్రి భరత్, టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ, పార్టీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఆదోని నియోజకవర్గ అబ్జర్వర్ కేశవరెడ్డి హాజరయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ... కార్యకర్తల సమస్యలన్నీ తనకు తెలుసని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. టిడిపి, బిజెపి, జనసేన పొత్తు మరో 15 ఏళ్లు కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలు అందరితో కలిసి మెలిసి ఉండాలని కోరారు. మైనార్టీ ఉర్దూ కళాశాలను ప్రారంభిస్తామని, మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రాత్రి ఆదోనిలోనే బస
కార్యకర్తల సమావేశం అనంతరం అదే సభా వేదిక వద్ద ప్రత్యేకంగా ఉన్న బస్సులో లోకేష్ అక్కడే బస చేశారు. అంతకు ముందు నియోజకవర్గంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్యకర్తలను అభినందించి మెమోంటోలు అందజేశారు. కార్యకర్తలతో ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. గురువారం ఉదయం పత్తికొండ నియోజకవర్గంలోని హోసూరు వద్ద టాటా సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమానికి లోకేష్ బయల్దేరుతారని నాయకులు తెలిపారు.







కామెంట్‌లు (0)