బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్
ప్రజాశక్తి-అవనిగడ్డ: మోపిదేవి బీసీ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి లంకె కుమార్‌రాజా అనుమానాస్పద మృతి ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శనివారం అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎదుట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థి తల్లిదండ్రులు హరికృష్ణ, ప్రభుకుమారి, కుటుంబ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్ చెన్ను వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.
తమ కుమారుడు ఎలా మృతి చెందాడనే విషయం తెలియడం లేదని, మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన అనంతరం వార్డెన్, హాస్టల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్, వాచ్‌మెన్, పాఠశాల ప్రిన్సిపల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.
గ్రామస్తులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. రవి, జిల్లా కార్యదర్శి సమరం, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవ గోవర్ధన్ తదితరులు ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న సీఐలు యువకుమార్, చల్లపల్లి సీఐతో పాటు అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల ఎస్‌ఐలు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ బాధితులు, గ్రామస్తులు పట్టువీడకుండా సుమారు మూడు గంటల పాటు నిరసన కొనసాగించారు.
ఈ క్రమంలో అగ్నికుల క్షత్రియ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు బాధితులతో మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులతో సంప్రదింపులు జరిపారు. పాఠశాల హెచ్‌ఎం, హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని, ఘటనపై విచారణ నిర్వహించి దోషులుగా తేలితే వారిని రిమాండ్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. వైసీపీ యువనేత బడే గౌతమ్ కూడా బాధితులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.
ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థి మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ప్రభుత్వం నుంచి తమకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ వచ్చే వరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించబోమని కుటుంబ సభ్యులు తెలిపారు.








కామెంట్‌లు (0)