ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.52కే నాణ్యమైన బియ్యం.. : మంత్రి నాదెండ్ల

1 గంట క్రితం

rice
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్ : తక్కువ ధరకే బియ్యం అమ్మకాల కేంద్రాలు రాష్ట్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆదివారం ప్రారంభం అయ్యాయి. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే బియ్యం అందించి సామాన్యుడికి అండగా నిలవాలన్న కూటమి ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అమ్మకాలను ఆదివారం ఉదయం నుంచి ప్రారంభించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ. 52కు, బీపీటీ రా రైస్ కేజీ రూ. 50 లకు ప్రత్యేక కౌంటర్లలో ప్రజలకు విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా చేసుకొని ప్రతి మనిషికి 10 కేజీల బియ్యం చొప్పున కౌంటర్లలో అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్ లో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరకే స్వయంగా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. "బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, సమీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రజలకు అందుబాటులో ప్రత్యేకంగా తక్కువ ధరకు బియ్యం అమ్మాలని నిర్ణయించాం. దీనిలో భాగంగా రాష్ట్ర రైస్ మిల్లర్లతో చేసిన చర్చల్లో భాగంగా తక్కువ ధరకే బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. దీనికి రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తామని ముందుకు రావడం అభినందనీయం. బహిరంగ మార్కెట్లో రూ. 65 నుంచి రూ. 62లకు లభ్యమవుతున్న బిపిటి సూపర్ ఫైన్ రకం బియ్యం ప్రత్యేక కౌంటర్లలో రూ. 52కు, బహిరంగ మార్కెట్లో రూ.58 రూపాయల నుంచి రూ.60 ధరకు దొరుకుతున్న బియ్యాన్ని రూ. 50 కు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. నేటి నుంచి అన్ని కౌంటర్లలో బియ్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు అందించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. ప్రజలకు కష్టం రాకమునుపే అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే ప్రభుత్వం మాది. ఈ తక్కువ ధరలకే బియ్యం కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి" అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన రావు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ నూపుర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్