ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పైన కక్షసాధింపు పరాకాష్ట.. వెంటనే విడుదల చేయాలి : బుట్టా రేణుక

1 గంట క్రితం

The vendetta against Alur MLA Busine Virupakshi has reached its peak; he must be released immediately: Butta Renuka.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చిప్పగిరి (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసిపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించి, తెల్లవారుజామున ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లుగా నివాసంపై దాడి చేసి అదుపులోకి తీసుకెళ్లడం రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆమె మండిపడ్డారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైసిపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారన్న సమాచారం అందడంతో తక్షణమే అక్కడికి చేరుకున్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి పైనే దాడికి యత్నించి, ఆయన సోదరుడి చేయి విరగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులనే నిందితులుగా మార్చి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు._ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ వైసిపీ జిల్లా నాయకులు చిప్పగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ, ఎలాంటి ఆధారాలు లేకుండానే రాత్రికి రాత్రే కల్పిత కేసులు సృష్టించి ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి తో పాటు దాదాపు 20 మంది నాయకులపై కేసులు నమోదు చేసి, తెల్లవారుజామున ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేయడం లేదని, అధికార పార్టీ చెప్పిందే చట్టంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు, అరెస్టులను ఆయుధాలుగా మార్చుకోవడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి తో పాటు అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, దాడికి పాల్పడిన అసలు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "నేడు మీరు అధికార దుర్వినియోగంతో అమలు చేస్తున్న కక్షసాధింపు రాజకీయాలే రేపు మీకు ఆదర్శంగా మారుతాయి. అధికారాలు శాశ్వతం కావు.. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు. కాబట్టి కూటమి ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని వెంటనే విరమించుకోవాలి" అని బుట్టా రేణుక హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్