ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వద్దిరాల పీహెచ్‌సీలో నిర్లక్ష్యం రాజ్యం..

1 గంట క్రితం

Negligence reigns at Vaddirala PHC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వద్దిరాల పీహెచ్‌సీలో నిర్లక్ష్యం రాజ్యం..

  • పొదల్లో పాముల సంచారం

  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న సిబ్బంది


ప్రజాశక్తి-మైలవరం (కడప) : మైలవరం మండలం వద్దిరాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి భవనం చుట్టూ అడవి పొదలు, ముళ్ల చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ప్రాంగణం ప్రమాదకరంగా మారింది. ఎండిన కొమ్మలు, చెత్త పేరుకుపోవడంతో పాములు, తేళ్లు, విషపురుగులు తరచూ సంచరిస్తున్నాయని స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. పగటి వేళల్లోనే పరిస్థితి భయానకంగా ఉండగా, రాత్రి సమయంలో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది తీవ్ర భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఏ క్షణంలోనైనా పొదల్లో నుంచి పాము బయటకు వస్తుందేమోనన్న భయంతో రాత్రి విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పీహెచ్‌సీ ప్రధాన వైద్య కేంద్రం కావడంతో ప్రతిరోజూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, సాధారణ రోగులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల రోగులు కూడా భయపడుతూ ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో రాత్రివేళల్లో వచ్చే రోగులకు ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో పెరిగిన పొదలను వెంటనే తొలగించి, చెత్తను శుభ్రం చేయడంతో పాటు పాములు, విషకీటకాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో తరచూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, సిబ్బంది, రోగులకు భద్రత కల్పించాలని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్