అమరావతి : ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ అల్పపీడనం రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మేఘావృత వాతావరణం నెలకొని, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు వివరించారు.








కామెంట్‌లు (0)