చెన్నై : తిరుచందూర్ డిఎంకె ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిత ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తూత్తుకూడి జిల్లాలోని ఆత్తూరులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై తూత్తుకుడి జిల్లాలోని ఆత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాధాకృష్ణన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన కొద్దిసేపటికే ఈ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అనంతరం తదుపరి విచారణ కోసం ఆయనను తూత్తుకుడి జిల్లా ఎస్‌పి కార్యాలయానికి తరలించారు.
ఎమ్మెల్యే అరెస్టును ఖండించిన స్టాలిన్, కనిమొళి
డిఎంకె ఎమ్మెల్యే అరెస్టును డిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఖండించారు. తన నియోజకవర్గంలో ప్రజాపనులు చేపడుతూ, తనిఖీలు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సిఎం సినిమా తరహా యాక్షన్ శైలిలో పోలీస్ రాజ్‌ను నడుపుతున్నారని విమర్శించారు. తిరువైకుండం టివికె ఎమ్మెల్యేపై సామూహిక అత్యాచార బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, దోపిడీలు, మహిళలపై నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని స్టాలిన్ విమర్శించారు. ఒకవేళ పరువునష్టం కేసుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తే, నేటి మంత్రులు చేసే వ్యాఖ్యలకు గాను వారిలో ఎంతమందిని అరెస్ట్ చేయాల్సి వుంటుందని ప్రశ్నించారు. డిఎంకె ఎంపి కనిమొళి కూడా ఈ అరెస్ట్‌ను ఖండించారు. ఇటువంటి అణచివేతకు డిఎంకె ఎప్పటికీ తలొగ్గదని అన్నారు.








కామెంట్‌లు (0)