శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ప్రశ్న’ రావణ్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి : సిపిఐ(యం) డిమాండ్

1 గంట క్రితం

Central Government Must Oppose US Attacks: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 03:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సామాజిక కార్యకర్తలపై వేధింపులు ఆపండి : సిపిఐ(యం)


విజయవాడ : ‘ప్రశ్న’ రావణ్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి అని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. గత మూడు రోజులుగా ‘ప్రశ్న’ యూట్యూబర్ ‘రావణ’పై కేసులు మీద కేసులు పెట్టి వేధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించి శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజులుగా ‘ప్రశ్న’ యూట్యూబర్ ‘రావణ’పై కేసులు మీద కేసులు పెట్టి వేధించడమే కాకుండా, మరోవైపు జనసేన, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అతనిపై భౌతికదాడులకు సైతం సిద్ధమవడం, పిఠాపురం, మచిలీపట్నం పోలీసు స్టేషన్‌లపై దాడి చేయడానికి ప్రయత్నించినా ప్రభుత్వం, పోలీసు చేతలుడిగి, ప్రేక్షకపాత్ర పోషించడం ఆందోళనకరమన్నారు. రాజకీయ విశ్లేషకులైన కె.వి.రెడ్డిని హైదరాబాద్‌లో నిర్బంధంలోకి తీసుకోవడం, పోలీసులు ఈ సందర్భంగా మితిమీరి వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యంపాలు చేయడమేనన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.


ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, అరెస్టులు, వేధింపులు పెరిగాయని శ్రీనివాసరావు ఆరోపించారు. ఉపన్యాసాల్లో వాడిన పదజాలం, భాష అభ్యంతరకరంగా ఉంటే దానిపై సమాధానమివ్వొచ్చు తిరిగి విమర్శించవచ్చునని... అందుకు బదులుగా ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి బెదిరించడం, వేధించడం అప్రజాస్వామికం అని అన్నారు. అందరికీ దీన్ని వర్తింపజేస్తే అధికార పార్టీ నాయకులతో సహా అందరిపైనా కేసులు పెట్టి అరెస్టు చేయాల్సి వుంటుందన్నారు. విమర్శల్లో వ్యక్తిగత ఆరోపణలు, ముఖ్యంగా వ్యక్తిత్వహరణం అనుమతించకూడదనడంలో సందేహం లేదు అని చెప్పారు. ఈ విషయంలో అధికార పార్టీలు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. రావణ్ ఉపయోగించిన భాషను ఆమోదించలేము అని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గతంలోను, ఇప్పుడు పలు సందర్భాలలో పవన్‌ కల్యాణ్ వాడిన భాష కూడా అభ్యంతరకరంగానే ఉంది అని గుర్తు చేశారు. అదే దారిలో ‘రావణ్’ కూడా నడిచాడు... కానీ, ఏకపక్షంగా కేసులు పెట్టి వేధించడం సరైంది కాదు అని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంస్కృతి దారితప్పుతోందని ధ్వజమెత్రాఉ. విమర్శలు దారితప్పి వ్యక్తిత్వ హననానికి, మహిళలను అవమానించడానికి దారితీస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరకర భాషకు స్వస్తి చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

పబ్లిసిటీ కోసం అధికార పార్టీ నాయకుల అండచూసుకొని లేదా వారి ప్రోత్సాహంతోనే కొందరు యూట్యూబర్లు మితిమీరిన అసభ్యకర పదజాలం వాడుతున్నారనీ, అలాంటి వారిని ఆయా పార్టీలు నియంత్రించాలని కోరారు. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ బాధ్యత నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఇలాంటి అంశాలను అజెండాగా మార్చి కేసులు, అరెస్టుల వరకు తీసుకెళ్తున్నారు అని ఆరోపించారు. భిన్నాభిప్రాయాలను, ప్రభుత్వంపై విమర్శలను అణచివేయడానికి, ఉద్యమాల గొంతు నొక్కడానికి కేసులు పెట్టి మిగతావారిని కూడా బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని... ఇలాంటి నిరంకుశ, అప్రజాస్వామిక పద్దతులకు టిడిపి కూటమి ప్రభుత్వం స్వస్తి చెప్పాలని అన్నారు. వ్యక్తుల మధ్య జరిగే వాదవివాదాలు, రాజకీయ భిన్నాభిప్రాయాలు, విశ్లేషణలు తదితర అంశాలలో ప్రభుత్వం, పోలీసులు తలదూర్చకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్