మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
ప్రజాశక్తి–అమరావతి : దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. అల్పపీడన ద్రోణి ఉత్తరాంధ్ర తీరం వరకు విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష ప్రభావం కనిపించనుంది. పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు పంటల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక యంత్రాంగాలు ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలని సూచించారు.
మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న మూడు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో చెన్నై నగరంలో కుండపోత వర్షం కురిసింది. మీనంబాకంలో అత్యధికంగా 12 సెంటీమీటర్లు, నుంగంబాకంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు.








కామెంట్‌లు (0)