ప్రజాశక్తి - యంత్రాంగం : తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో గురువారం విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో గురువారం వర్షం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడ్డాయి. వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. పలు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. విజయనగరం పట్టణంలో సుమారు గంటన్నరపాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. గంటస్తంభం, రింగ్ రోడ్డు, గూడ్స్ షెడ్, రాజీవ్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షం నీరు రహదారిపై పొంగి ప్రవహించింది. రింగురోడ్డులోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ సమీపంలో రహదారిపై మోకాలు లోతు నీరు ప్రవహించడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధి మేడూరు గ్రామ సమీప అటవీ వ్యవసాయ ప్రాంతంలో పిడుగుపాటుకు రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మేకలను మేపుతున్న ఇద్దరు బాలురు స్పృహ కోల్పోయారు. గ్రామస్తులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
పిడుగుపాటుకు యువకుడు మృతి
పల్నాడు జిల్లా వినుకొండలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వెంకుపాలెం గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు అలియాస్ బుజ్జి (30), అదే గ్రామానికి చెందిన చెన్నుబోయిన కోటయ్య, గుడిపాటి పెద్ద బుజ్జి, ఎలగాలి శ్రీను, పూజల శివకృష్ణ... పోలేరమ్మ గుడి వద్ద ఉన్న పొలం పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో నలుగురు ఓ చెట్టు కిందకు చేరారు. ఆ చెట్టుపై పిడుగుపడడంతో కోటేశ్వరరావు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని వంగపండువలస గ్రామానికి చెందిన పాశల సత్యనారాయణ (42) ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ మోటారు ఫిట్టింగ్ చేసేందుకు వెళ్లారు. మోటార్ ను చెక్ చేసేందుకు ప్లగ్ లో వైర్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన తోటి వారు సపర్యలు చేసినా ఫలితం దక్కలేదు. వర్షాలకు ప్లగ్ బోర్డు, వైరు తడిసి ఉండడంతో విద్యుత్ షాక్ కు గురై మృతిచెందారని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మొదటి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ఆసుపత్రికి తరలించారు.








కామెంట్‌లు (0)