ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజా సమస్యలపై గళమిప్పండి

16 జులై, 2026

Jagan-2-o-Super-App
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:12 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఎంపిలకు జగన్‌ సూచన

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళమిప్పాలని వైసిపి ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్‌‌మోహన్‌‌రెడ్డి సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 20 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దీనిలో చర్చించారు. ఈ సమావేశంలో జగన్‌ ‌మోహన్‌‌రెడ్డి మాట్లాడుతూ డిఎస్‌‌సి స్కామ్, టీచర్లకు టెట్, ప్రశ్నిస్తే వేథింపులు, అక్రమ కేసులు, అరెస్టులు, సంక్షోభంలో వ్యవసాయం, కష్టాల్లో ఆక్వా రైతులు, సమస్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అప్పులు వంటి అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇదివరకే తాము మద్దతు ఇచ్చామని, దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయిందని, ఎక్కడ చూసినా స్కాములేనని అన్నారు. డిఎస్‌‌సి 2025 పోస్టుల భర్తీలో పెద్ద స్కాం చోటు చేసుకుందని, అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఇష్టాను సారంగా భూముల పందేరం జరుగుతోందని, దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్‌ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలోకూడా విపరీతమైన దోపిడీ జరుగుతోందని, చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవని అన్నారు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీ సాగుతోందని పేర్కొన్నారు. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారని ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారని ఈ అంశాలన్నీ పార్లమెంటులో లేవనెత్తాలని అన్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. టెట్‌ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. సుదీర్ఘ కాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్‌ పరీక్ష రాయమనడం, దాన్ని తప్పనిసరి చేయడం ఏ మాత్రం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలిసి వారి సమస్యలు విన్నవించాలని కోరారు.

రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారని అన్నారు. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణమని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇచ్చారని, దీనిపై పార్లమెంటులో ప్రశ్నించాలన్నారు. ఈ సమావేశంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు, లోకసభలో వైయస్సార్‌సీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు ఎం.గురుమూర్తి, వైయస్‌.అవినాష్‌రెడ్డి, గుమ్మా తనూజారాణి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులకుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా పాల్గొన్నారు.

‘జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌’ ఆవిష్కరణ

‘జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌’ను మాజీ సిఎం జగన్‌‌మోహన్‌‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వైసిపి పోస్ట్‌ చేసిన కంటెంట్‌ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్‌ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యాప్‌ తీసుకొచ్చినట్లు తెలిపారు. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చని పేర్కొన్నారు. ఎవరు పడితే వారు డిలీట్‌ చేసే హక్కు కూడా వారికి ఉండదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, పార్టీకి సంబంధించిన ఏ అంశంపైన అయినా ఈ యాప్‌ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమవొచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఈ యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు కూడా గురవుతున్న వారు ఇప్పుడు డిజిటల్‌ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు కూడా యాప్‌‌తో అనుసంధానం అవుతాయని వివరించారు. ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో తమపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్‌యాప్‌ను ఎవరూ ఆపలేని విధంగా సొంతంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్