ఎస్ఎఫ్ఐ అఖిల భారత సమావేశాల పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సమావేశాలు ఈ నెల 13, 14, 15న విశాఖపట్నంలో జరుగనున్న నేపథ్యంలో ఆ సమావేశాల పోస్టర్‌ను గురువారం జగదాంబ దరి సంఘం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ... ఈ సమావేశాలకు దేశ నలుమూలల నుండి విద్యార్థి రంగ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 13న ఉదయం పది గంటలకు విశాఖలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వేలాది మందితో భారీ ప్రదర్శన, అనంతరం గురజాడ కళాక్షేత్రం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభకు సంఘం అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం.షాజీ, ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పల్లవి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థి ఉద్యమాలకు దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై ప్రసంగించనున్నారని తెలిపారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ, సిబిఎస్‌సి మూల్యాంకనంలో అవకతవకలు, యుజి నెట్ పరీక్ష రద్దు వంటి అంశాలతో పాటు జాతీయ విద్యా విధానంలో చేయవలసిన మార్పులు, కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించాల్సిన బడ్జెట్, దాని ఖర్చు, దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల అభివృద్ధి వంటి అంశాలు, రాష్ట్రంలో విద్యను కార్పొరేటీకరణ చేయడం, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం, ఫీజుల భారం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై సమావేశాలలో విస్తృతంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కావున విద్యార్థులు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు, విద్యా శ్రేయోభిలాషులు ఈ సమావేశాలకు అన్ని విధాలా సహకారం అందించి జయప్రదం చేయాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం పూర్వ జిల్లా కార్యదర్శి ఎల్.జె.నాయుడు, రాష్ట్ర కమిటీ సభ్యులు మౌనిక, జిల్లా కమిటీ సభ్యులు భరత్, వినయ్, హరీష్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)