- సిఎంకు సిపిఐ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పులిచింతల ప్రాజెక్టు ఎగువ భాగంలో కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆయన శుక్రవారం లేఖ రాశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని బుగ్గమాదారం – దొండపాడు గ్రామాల మధ్య కృష్ణానదిపై రూ.394 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని తెలిపారు. రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో ఈ పథకం అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టుపై ఆధారపడిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని పెద్దకూరపాడు నియోజకవర్గంలో 21, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో 51 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సాగునీటి సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గ్రామీణ తాగునీటి పథకాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సుమారు 50 వేల ఎకరాల సాగుభూమి, వేలాది మంది రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పిస్తున్న నేపథ్యంలో తెలంగాణ చేపడుతున్న ఈ ఎత్తిపోతల పథకం డెల్టా ప్రాంత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)