సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition రాయగడ రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

4 రోజుల క్రితం

RAILWAYFAMILLIESDHAMA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిరిపురంలోని జిఎం కార్యాలయం వద్ద నిరసన

ప్రజాశక్తి -ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): రాయగడ డివిజన్‌లో కొనసాగుతున్న గత వాల్తేరు డివిజన్ రైల్వే ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్‌ ఇండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ జోనల్‌ కార్యదర్శి భోలానాథ్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్లు కల్పిస్తూ విశాఖపట్నం–రాయగడ డివిజన్ల మధ్య జాయింట్‌ ప్రొసీజర్‌ ఆర్డర్‌ (జెపిఒ)ను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు రాయగడ డివిజన్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సిరిపురంలోని జిఎం–ఎస్‌సిఒఆర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భోలానాథ్‌ మాట్లా‌డుతూ... వాల్తేరు డివిజన్ నుంచి రాయగడ డివిజన్ ఏర్పడి 75 రోజులు దాటినా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రైల్వే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల సీనియారిటీ, బదిలీలు, ప్రమోషన్లు, కుటుంబ పరిస్థితులు, పిల్లల విద్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన పరిష్కారం చూపాలని కోరారు. గతంలో వివిధ రైల్వే జోన్లు, డివిజన్ల ఏర్పాటు సమయంలో ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్లతో జెపిఒలు జారీ చేసిన విధానాన్ని రాయగడలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా నియమితులయ్యే సిబ్బందిని రాయగడలో నియమించి, నిర్దిష్ట సర్వీస్‌ పూర్తి చేసిన సీనియర్‌ ఉద్యోగులకు విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ అయ్యే అవకాశం కల్పించాలని సూచించారు. 2026 జూన్‌ 1 తర్వాత కంబైన్డ్‌ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా జారీ చేసిన పోస్టింగ్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని, కొత్త నియామకాల ద్వారా సిబ్బంది కొరతను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి.మణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రైల్వే యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు బి.జగన్‌, హరికృష్ణ, చిన్నోడు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్