బాధితులకు అందజేసిన కాకినాడ ఎస్పీ బిందు మాధవ్
ప్రజాశక్తి - కాకినాడ: కేంద్ర ప్రభుత్వ సిఇఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పోలీసులు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో, రూ.1.20 కోట్ల విలువైన 602 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. సిఇఐఆర్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా ఐటీ కోర్ బృందం ఐఎంఈఐ ట్రాకింగ్, జీపీఎస్ ట్రేసింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ నిఘా, డేటా విశ్లేషణ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన 12 విడతల్లో మొత్తం 4,603 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని, వాటి మొత్తం విలువ సుమారు రూ.7.68 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ పోయిన వెంటనే బాధితులు www.ceir.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. ఒకవేళ సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబరుకు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఫోన్ పోయిన వెంటనే అప్రమత్తమై బ్యాంక్ ఖాతాలు, యూపీఐ సేవలను సురక్షితం చేసుకోవాలని, సిమ్ కార్డును బ్లాక్ చేయించడంతో పాటు గూగుల్, యాపిల్ ఐడీలు, బ్యాంకింగ్ యాప్‌లు, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు బిల్లు, బాక్స్, ఐఎంఈఐ నంబర్లను తప్పనిసరిగా పరిశీలించాలని, అపరిచితుల నుంచి ఫోన్లు కొనుగోలు చేసి ఇబ్బందుల్లో పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు మహంతి కిషోర్ కుమార్, ఎస్. శ్రీనివాసరావు, ఎస్‌డీపీఓ పాటిల్ దేవరాజ్ మనీష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ డి. దుర్గా శేఖర్ రెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)